Begin typing your search above and press return to search.

మాకెక్కడ దొరికారు ఈ ఎంపీ అభ్యర్థులు?

By:  Tupaki Desk   |   7 April 2019 6:55 AM GMT
మాకెక్కడ దొరికారు ఈ ఎంపీ అభ్యర్థులు?
X
ఒక ఓటరు.. పోలింగ్ బూత్ కెళ్లి తనకు ఇష్టమైన పార్టీ ఎమ్మెల్యేకు ఓటు వేస్తాడు.. లేదా తనకు డబ్బు, మద్యం ఇచ్చి ప్రలోభపెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థికే ఓటేస్తాడు.. పనిలోపనిగా పక్కనే అదే పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటు గుద్దెస్తాడు.. ఈ ప్రక్రియలో ఎమ్మెల్యే అభ్యర్థుల కష్టాలు, ఖర్చే ఎక్కువ. ఎంపీలది తక్కువ.. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు తన పరిధిలోని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు తలా పది, ఇరవై కోట్లో ఇచ్చి మేనేజ్ చేయమంటారు. కానీ ఇక్కడ మాత్రం కొత్తవాళ్లను తెచ్చి ఈ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారట..

విశాఖ పార్లమెంట్ సీటు చాలా హాట్ గా మారింది. ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున బాలయ్య చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు అయిన బడా విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ పోటీచేస్తున్నారు. చంద్రబాబుకు దగ్గర కావడంతో ఈయన బిందాస్ గా ఉన్నాడట.. రాజకీయాల్లోకి కొత్త కావడంతో ప్రచారం అయితే చేస్తున్నాడట.. కానీ ఎమ్మెల్యే ఆర్థిక అవసరాలు.. వారి ప్రచారానికి ఖర్చు, తోడ్పాటును అందించడం లేదట.. దీంతో విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఈ విషయంపై చంద్రబాబు, లోకేష్ లకు ఫిర్యాదు చేయలేక తలలు పట్టుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక వైసీపీ నుంచి పోటీచేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ కూడా బడా బిల్డర్. కోట్లకు పడగలెత్తినవాడే.. ఈయన కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే తను గెలిచినట్టేనని.. వారికి రూపాయి కూడా ఖర్చు చేయడం లేదట.. ఎమ్మెల్యేలు మాత్రం ఊరువాడా తిరుగుతూ జగన్ సభలకు ఖర్చు పెడుతూ గుల్ల చేసుకుంటున్నారట.. ఈయన మాత్రం రూపాయి విదిల్చక గెలుపు కోసం కలలుకంటున్నాడట..

ఇక జనసేన నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిజాయితీ,విలువలకు నిలువెత్తు నిదర్శనమాయే.. అందుకే ఈయన పరిధిలో పోటీచేస్తున్న జనసేన అభ్యర్థులు ఈయనను ప్రచారానికి డబ్బులు కూడా అడగలేని పరిస్థితి. ఇలా విశాఖ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థులు ఖర్చు చేయకుండా బిందాస్ గా ఉండగా.. విపరీతంగా ఖర్చు చేసుకుంటూ ఎమ్మెల్యేలు నెత్తినోరు బాదుకుంటున్నారు. మాకు ఈ ఎంపీ అభ్యర్థులు ఎందుకు తగిలారురా బాబూ అంటూ మథనపడుతున్నారట..