Begin typing your search above and press return to search.

కేసీయార్ ను ఓడించకపోతే ఈ జన్మకు సార్ధకత లేదు

By:  Tupaki Desk   |   27 July 2022 5:34 AM GMT
కేసీయార్ ను ఓడించకపోతే ఈ జన్మకు సార్ధకత లేదు
X
‘కేసీయార్ ను ఓడించకపోతే ఈ జన్మకు సార్ధకత లేదు’ ఇది కేసీయార్ ను ఉద్దేశించి తాజాగా ఎంఎల్ఏ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. కేసీయార్ కు ఈటలకు మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగ తయారైన విషయం అందరికీ తెలిసిందే.

మంత్రివర్గం తో బలవంతంగా రాజీనామా చేయించిందే కాకుండా ఏకంగా పార్టీ నుండే ఈటలను బహిష్కరించారు. అప్పటినుండి అవమానంతో రగిలిపోతున్న ఈటెల ఎంఎల్ఏగా రాజీనామా చేసి ఉపఎన్నికల్లో మళ్ళీ గెలిచి కేసీయార్ పై కసి తీర్చుకున్నారు.

ఎంఎల్ఏగా గెలవటంతో ఈటల కసి తీరిందని అనుకున్నారు కానీ అప్పటినుండే ఎంఎల్ఏలో కసి మరింతగా పెరిగిందని తర్వాతే అర్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేలులో కేసీయార్ పై పోటీచేసి ఓడిస్తానని చాలెంజ్ చేశారు.

లేకపోతే హుజూరాబాద్ లో తనపైన పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతు తాను ఎప్పుడూ కేసీయార్ బొమ్మపై గెలవలేదన్నారు. పదవుల కోసమో లేకపోతే మంత్రిపదవి కోసమో తాను టీఆర్ఎస్ లో చేరలేదని చెప్పారు.

మొదటినుండి కూడా తాను తన సొంత ఇమేజి మీదే ఎన్నికల్లో గెలిచినట్లు ఈటల తెలిపారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించాలని కేసీయార్ ప్రయత్నించినట్లు మండిపడ్డారు. మొత్తం నలుగురిని ఓడించాలని కేసీయార్ ప్రత్యేకంగా ప్రయత్నిస్తే తాను మాత్రమే గెలిచానన్నారు. స్వతంత్రంగా ఆలోచించే వారిని కేసీయార్ ఇష్టపడరని తాను ఏమి చెబితే అది బానిసల్లాగ పడుండేవారిని మాత్రమే ఇష్టపడతారని ఆరోపించారు. సరే ఈ ఆరోపణలన్నీ బాగానే ఉన్నాయికానీ కేసీయార్ పైన ఈటల ఇంతగా ఎందుకు రెచ్చిపోతున్నారో అర్ధంకావటంలేదు.

నిజంగానే కేసీయార్ మీద గెలిచేంత సీన్ ఈటలకు ఉందా అన్నదే అసలైన ప్రశ్న. మొన్నటి ఎన్నికల్లో ఈటల 23 వేల ఓట్ల మెజారిటితో గెలిచుండచ్చు. అయితే అది కాంగ్రెస్ సహకారంతో మాత్రమే గెలిచారన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తనఓట్లను త్యాగంచేసిన కారణంగా మాత్రమే ఈటెల గెలవగలిగారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరికెంత సీనుందో తేలిపోతుంది.