Begin typing your search above and press return to search.

బుచ్చ‌య్యా...భుజాలు త‌డుముకుంటున్నారే!

By:  Tupaki Desk   |   11 Jun 2018 9:50 AM GMT
బుచ్చ‌య్యా...భుజాలు త‌డుముకుంటున్నారే!
X
2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే లక్ష్యంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట సుధీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ఆ యాత్ర‌ను ఇప్ప‌టికే మూడింత‌ల్లో రెండింత‌ల‌కు పైగా పూర్తి చేసేశారు. నేటి మ‌ధ్యాహ్నానికి 2300 కిలో మీట‌ర్ల యాత్ర‌ను పూర్తి చేసిన జ‌గ‌న్‌... నేటి సాయంత్రం లోగా రెట్టించిన ఉత్సాహంతో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నుంచి తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించ‌నున్నారు. రాయ‌లసీమ నుంచే ప్రారంభ‌మైన ఈ యాత్ర‌కు అంత‌కంత‌కూ పెరిగిన ప్ర‌జా మ‌ద్ద‌తుతో అధికార పార్టీ నేత‌ల్లో గుబులు అంత‌కంత‌కూ జిల్లా ప్ర‌జ‌లు టీడీపీ నేత‌ల నోట మాట రాకుండా చేసిన విష‌య‌మూ మ‌న‌కు తెలిసిందే. గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి యాత్ర ప్ర‌వేశిస్తుండ‌గా... జ‌గ‌న్‌ కు స్వాగ‌తం చెప్పేందుకు పోటెత్తిన ప్ర‌జ‌ల‌తో క‌న‌క‌దుర్గ‌మ్మ వార‌ధి దాదాపుగా ఊగిపోయింద‌ని చెప్పాలి. జ‌గ‌న్‌ కు వీడ్కోలు ప‌లికేందుకు వ‌చ్చిన గుంటూరు జ‌నం - స్వాగ‌తం చెప్పేందుకు త‌ర‌లివ‌చ్చిన కృష్ణా జిల్లా జ‌నంతో దుర్గ‌మ్మ వార‌ధి కిట‌కిట‌లాడింది.

ఇదే ప్ర‌భంజ‌నం కొన‌సాగితే... త‌మ ప‌ని అయిపోయిన‌ట్టేన‌న్న భావ‌న‌తో జ‌గ‌న్ యాత్ర‌కు టీడీపీ స‌ర్కారు ఎక్క‌డిక‌క్క‌డ అడ్డంకులు సృష్టించేందుకు య‌త్నించింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా లేక‌పోలేదు. ఇందులో భాగంగానే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టే క్ర‌మంలో జ‌గ‌న్ యాత్ర గోదావ‌రి వంతెన‌పై నుంచి వెళ్లాల్సి ఉంది. ఇక్క‌డే టీడీపీ క‌పట నాట‌కాలు బ‌య‌ట‌ప‌డిపోయాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. వంతెన పాత‌దైపోయింద‌ని - జ‌గ‌న్ యాత్ర దానిపై నుంచి వెళితే... బ్రిడ్జి కూలిపోవ‌డం ఖాయ‌మ‌ని పోలీసు శాఖ‌తో చెప్పించిన ప్ర‌భుత్వం జ‌గ‌న్ యాత్ర‌కు బ్రేకులేసే య‌త్నం చేసింది. అయితే వైసీపీ నుంచి త‌క్ష‌ణ స్పంద‌న రావ‌డ‌మే కాకుండా... స‌ర్కారు నిజనైజాన్ని బ‌య‌ట‌పెట్టేయ‌డంతో తూర్పు గోదావ‌రి జిల్లా పోలీసు యంత్రాంగం కూడా దారికి రాక త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే ముందుగా వంతెన‌పై యాత్ర‌కు అనుమ‌తించ‌ని పోలీసులు ఆ త‌ర్వాత స‌రేన‌న్నారు.

ఈ వ్య‌వ‌హారం వెనుక ప్ర‌భుత్వ పాత్ర ఎంత ఉంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ - రాజ‌మహేంద్ర‌వ‌రం రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లు... ప్ర‌భుత్వ పాత్ర‌ను ఇట్టే క‌ళ్ల‌కు క‌ట్టేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా దీనిపై బుచ్చ‌య్య ఏమ‌న్నారంటూ... *పోలీస్ శాఖ ఇచ్చిన నోటీస్ తో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు కూడా భద్రతా కారణాల రీత్యా ఈ బ్రిడ్జిపై నుంచి రావొద్దంటూ మాకు నోటీస్ లు ఇచ్చారు* అని బుచ్చ‌య్య పేర్కొన్నారు. అయినా ఏ ఒక్క‌రూ అడ‌గ‌కుండానే... ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వ పాత్ర లేదంటూ వ‌కాల్తా పుచ్చుకోవాల్సిన అవ‌స‌రం బుచ్చ‌య్య‌కు ఎందుకొచ్చింద‌న్న‌దే ఇప్పుడు అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయిన గోరంట్ల‌... ప్ర‌భుత్వంలో ఎలాంటి ప‌ద‌విలోనూ లేరు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉద్దేశ్యాల‌ను బుచ్చ‌య్య ఎలా బ‌య‌ట‌పెడుతున్నార‌న్న ప్ర‌శ్న కూడా ఇక్క‌డ ఉద‌యించ‌క మాన‌దు. ఏదో సామెత చెప్పిన‌ట్టుగా గుమ్మ‌డికాయ‌ల దొంగ ఎవ‌రంటే... భుజాలు త‌డుముకున్న చందంగా బుచ్చ‌య్య ప‌రిస్థితి ఉంద‌న్న కోణంలో ఇప్పుడు కొత్త‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.