Begin typing your search above and press return to search.

తన గొయ్యి తానే తవ్వుకున్నారా ?

By:  Tupaki Desk   |   26 Aug 2021 8:31 AM GMT
తన గొయ్యి తానే తవ్వుకున్నారా ?
X
తనంతట తానుగా చేసిన ఓ తప్పు వల్ల సీనియర్ నేత, ఆరుసార్లు ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇమేజి మొత్తం డ్యామేజైపోయింది. రాజకీయాల్లో హత్యలుండవని ఆత్మహత్యలే ఉంటాయనే విషయం తాజాగా గోరంట్ల వ్యవహారం నిరూపిస్తోంది. ఎప్పటినుండో చంద్రబాబునాయుడు, లోకేష్ పై అణిచిపెట్టుకునున్న మంటను బుచ్చయ్య ఒక్కసారిగా బయటకు కక్కేశారు. చంద్రబాబు, లోకేష్ పై బుచ్చయ్య చేసిన ఆరోపణలు, విమర్శలు తర్వాత చల్లారిపోయాయి. మరిప్పుడు బుచ్చయ్య భవిష్యత్తు ఏమిటి ?

ఇపుడిదే అంశంపై పార్టీతో పాటు జనాల్లో చర్చలు జరుగుతున్నాయి. పార్టీ ఆత్మగౌరవాన్ని కోల్పోయిందని, తనను ఉద్దేశ్యపూర్వకంగా తండ్రి, కొడుకులు అవమానించారంటు గోరంట్ల గట్టిగానే తన వాయిస్ వినిపించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ టీడీపీలో ఆత్మగౌరవం లేదని బుచ్చయ్య కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అధికారం కోసం ప్రతి ఎన్నికకు ఓ పార్టీతో పొత్తులు పెట్టుకోవటంతోనే జనాల్లో పార్టీ ఇమేజి పలుచనైపోయింది.

చివరకు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టారో అదే కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నపుడే పార్టీకి ఆత్మగైరవం లేదని తేలిపోయింది. పైగా 2019 ఎన్నికల తర్వాత పార్టీని వదిలేసిన నేతల్లో కొందరు ఇదే విషయాన్ని గట్టిగానే చాటిచెప్పారు. కాబట్టి ఆత్మగౌరవం అంటు ఇపుడు బుచ్చయ్య గొంతు చించుకోవడం లో అర్థం లేదు. ఇక తాను ఫోన్ చేసినా తండ్రీ, కొడుకులు మాట్లాడలేదనే విషయాన్ని స్వయంగా బుచ్చయ్య చెబితేనే లోకానికి తెలిసింది. అంటే పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని తనంతట తానే బయట పెట్టుకున్నారు.

మరి పార్టీలో ఇంత అవమానాలకు గురైన బుచ్చయ్య ఇంకా పార్టీలోనే కంటిన్యూ అవటంలో అర్ధమేలేదు. తనతో మాట్లాడటానికి కూడా చంద్రబాబు, లోకేష్ ఇష్టపడటంలేదని చెప్పుకున్న తర్వాత కూడా ఇంకా బుచ్చయ్య పార్టీలో ఎలా కంటిన్యు అవుదామని అనుకున్నారో అర్థం కావటంలేదు. తండ్రి, కొడుకులతో పాటు పార్టీకి కూడా బుచ్చయ్య పెద్ద డ్యామేజే చేశారు. మరలాంటపుడు పార్టీలోనే కంటిన్యు అయినా బుచ్చయ్యకు ఏమి మర్యాదిస్తారు ? గోరంట్లకే పార్టీలో దిక్కు లేనప్పుడు ఇక ఆయన మద్దతుదారులకు ఏముంటుంది ?

మొత్తానికి తన ఇమేజిని తనంతట తానే బుచ్చయ్యే డ్యామేజి చేసుకున్నారు. 76 ఏళ్ళ వయసులో పార్టీ అధినేత+ కొడుకుపై బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేసిన బుచ్చయ్య ఏమి సాదిద్దామని అనుకున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఈ వయసులో టీడీపీని వదిలేసి ఇతర పార్టీల్లోకి వెళ్ళే ఉద్దేశ్యంలో ఉన్నారేమో తెలీదు. ఏ పార్టీలోకి వెళ్ళిన వయసు రీత్యా రాజకీయంగా బుచ్చయ్యకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని అనుకునేందుకు లేదు. బుచ్చయ్య రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సిందే.