Begin typing your search above and press return to search.

కాల్ మనీ డబ్బంతా ఆ మంత్రిదేనా?

By:  Tupaki Desk   |   28 Dec 2015 10:30 PM GMT
కాల్ మనీ డబ్బంతా ఆ  మంత్రిదేనా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన కాల్ మనీ డబ్బంతా కృష్ణా జిల్లాకు చెందిన కీలక మంత్రిదేనా? ఆయన పెట్టుబడుల నేపథ్యంలోనే మిగిలిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు పెట్టుబడులు పెట్టారా? కాల్ మనీ వ్యవహారం బయట పడగానే.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేయించి కాల్ మనీ వ్యవహారాన్ని పక్కన పడేయడానికి కారణం ఆ మంత్రిని బయట పడేయడానికేనా? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నాయి అధికార వర్గాలు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత నేనే అనే అభిప్రాయంలో ఉండే మంత్రి ఒకరు కాల్ మనీ వ్యవహారం మొత్తానికి సూత్రధారి అని ప్రచారం జరుగుతోంది. కాల్ మనీలోని సింహభాగం పెట్టుబడులు ఆయనవేనని కూడా చెబుతున్నారు. ఆయన అండ చూసుకునే మిగిలిన వారితోపాటు పలువురు ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులు పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు. కాల్ మనీ వ్యవహారం బయటకు వస్తే ఆ మంత్రితోపాటు పలువురు కీలక నేతలు, అధికారులు కూడా పూర్తి స్థాయిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే రాజధాని గౌరవం అనే వంకతో ప్రభుత్వం దానిని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించిందని, రాష్ట్రం మొత్తంమీద దాడులు చేసి.. అసెంబ్లీలో ప్రతిపక్షం మీద ఎదురు దాడి చేసి.. కాల్ మనీ వ్యవహారం మొత్తాన్ని చాప చుట్టేసిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అసెంబ్లీలో నానా గందరగోళం చేసిన ప్రతిపక్షం కూడా అసెంబ్లీ తర్వాత అసలు కాల్ మనీ గురించి మాట్లాడడం లేదని, దీని వెనక ఏదో ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.