Begin typing your search above and press return to search.

నీకు సిగ్గుందా.. లైవ్ లో చూపిస్తావ్: ఎంపీ భరత్ ను తప్పుపట్టిన జక్కంపూడి

By:  Tupaki Desk   |   21 Sep 2021 4:30 PM GMT
నీకు సిగ్గుందా.. లైవ్ లో చూపిస్తావ్: ఎంపీ భరత్ ను తప్పుపట్టిన జక్కంపూడి
X
తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ భరత్ మధ్య రోజురోజుకు వివాదం ముదురుతోంది. ఎంపీ భరత్ పై జక్కంపూడి రాజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వ నాశనం చేస్తున్నారని జక్కంపూడి ఆరోపించారు.

మొదటి ఎంపీ భరత్ తీరును.. ఆయన వ్యవహారశైలిపై జక్కంపూడి నిప్పులు చెరగగా.. తాజాగా దానికి కౌంటర్ ఇస్తూ ఎంపీ భరత్ కూడా అదే స్థాయిలో స్పందించారు. ‘తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారని.. వైసీపీ నేతలు మౌనంగా ఉండడాన్ని ప్రస్తావిస్తే దాడిని ఖండిస్తే తప్పా?’ అని ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. ఇది వైసీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం అని.. టీడీపీ నాయకుల దాడి జరిగితే నాపై అభాండాలు వేయడం జక్కంపూడి రాజాకు కరెక్ట్ కాదని ఎంపీ భరత్ స్పష్టం చేశారు.

తమ కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని ఎంపీ భరత్ అన్నారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని మాట్లాడుతున్నారని.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. తాను ఎక్కువగా పనిచేస్తున్నానే బాధేమోనని.. రాజమండ్రిలో ఎన్నో మంచి పనులు చేశానని వివరించాడు. తాను నిస్వార్థంగా పనిచేస్తున్నానని.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు అని భరత్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ విమర్శలపై జక్కంపూడి మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ భరత్ ను కడిగేశారు. నువ్వు ఎంత కవర్ చేసే ప్రయత్నం చేసినా వెనుకాల చేస్తున్నవి తెలుసు అని జక్కంపూడి విమర్శించారు. మేం క్షేత్రస్థాయిలో నుంచి వచ్చామని.. ప్రజల నాడి మాకు తెలుసు అని.. మాకు తెలిసినంతగా నీకు కనీసం యువకుడైన నీకు 5శాతం కూడా ప్రజా పల్స్ తెలియదని అన్నారు.

మేం పుట్టింది పెరిగింది.. తెల్లారి లేస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకూ ప్రజల్లో ఉంటామని జక్కంపూడి చెప్పుకొచ్చారు. నువ్వు ఎన్నిరకాల కుట్రలు పన్నినా.. ఎన్ని చీప్ చేష్టలు చేసినా.. నీ కథలు, నీ ఆటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని ఎంపీ భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి విమర్శలు గుప్పించారు.

భార్యభర్తలు విడిపోయిన వారు.. పేదలు తమ వ్యక్తిగత సమస్యలు చెప్పడానికి వస్తే వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బూస్ట్ పేరిట వాటిని అందరికీ చేరేలా చేసి వారి పరువుతీస్తావా? అని ఎంపీ భరత్ పై జక్కంపూడి విరుచుకుపడ్డారు. వారి ఆత్మాభిమానాన్ని సోషల్ మీడియా సాక్షిగా తాకట్టు పెడుతున్నాడని.. ఇది మంచి పద్ధతి కాదని జక్కంపూడి విమర్శలు గుప్పించారు.