Begin typing your search above and press return to search.

మంత్రి మీద ఎమ్మెల్యే సీరియస్.... ?

By:  Tupaki Desk   |   19 Dec 2021 12:52 PM GMT
మంత్రి మీద ఎమ్మెల్యే సీరియస్.... ?
X
ఏదో జరుగుతోంది, ఎక్కడో తేడా కొడుతోంది. చాప కింద నీరులా అసంతృప్తి అనేది ఉంది కాబోలు. లేకపోతే సడెన్ గా సీనియర్ ఎమ్మెల్యే ఇలా బయట వేదిక మీద గొంతు చించుకోరు కదా. ఏకంగా మంత్రి మీదనే విమర్శలు చేయరు కదా. ప్రస్తుతం ఇదే వైసీపీలో చర్చగా సాగుతోంది. విశాఖ జిల్లా పరిషత్తు సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు మీద ఏకంగా సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఒక రేంజిలో ఫైర్ అయ్యారు.

కారణం అన్నది సాంకేతికం, పైగా ప్రోటోకాల్ కి సంబంధించిన విషయం, కానీ మంత్రి మీదకే డైరెక్ట్ అటాక్ చేసి మరీ కన్నబాబు రాజు తన రాజ‌ పౌరుషం చూపించారు. వేదిక మీద జెడ్పీ వైస్ చైర్మన్లను కూడా ఆహ్వానించడం మీద ఆయన మండిపడ్డారు. ఇదెక్కడి విధానం అంటూ ప్రశ్నించారు, రచ్చ చేశారు. నిజానికి జెడ్పీ చైర్మన్ మాత్రమే వేదిక మీద ఉంటారు, కానీ అవంతి వైస్ చైర్మన్లను కూడా పిలవడంతోనే వివాదం రాజుకుంది.

దాంతో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబురాజు దాన్ని అవమానంగా భావించారు. మమ్మల్ని దిగువన పెట్టి వైస్ చైర్మన్లకు అగ్రాసనం ఏంటి అనుకున్నారో ఏమో కానీ మంత్రి మీద ఫైర్ అయిపోయారు. ఇదేంటి ఇలా చేస్తున్నారు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి సభ నుంచి వెళ్లిపోతామంటూ గట్టిగానే హెచ్చరించారు. అంతే కాదు, జెడ్పీటీసీలకు లోకల్ గా ఆఫీసులు ఉండాలని కూడా ఆయన ప్రతిపాదించారు, అయితే ప్రోటోకాల్ లో అలా లేదని అధికారులు చెప్పడంతో కూడా మండిపడ్డారు.

మొత్తానికి విషయం ఇలా ఉండగా కన్నబాబురాజు సొంత పార్టీ మంత్రి మీద విపక్షం కంటే కూడా ఎక్కువగా విరుచుకుపడడానికి కారణం ఏంటి అన్నదే వైసీపీలో చర్చగా ఉంది. నిజంగా మంత్రి మీద ఆయనకు ఎందుకు గుస్సా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అది మంత్రి వరకే పరిమితమా లేక పార్టీ నేతల మీద, తమ ప్రభుత్వ విధానాల మీద కూడా ఆయనకు ఏమైనా బాధలు అభ్యంతరాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది.

ఎందుకంటే ఈ మధ్యనే ఆయన కుమారుడు సుకుమార వర్మను డీసీసీబీ పీఠం నుంచి సడెన్ గా తప్పించేశారు. నర్శీపట్నానికి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరదలు అనితకు ఆ పదవి కట్టబెట్టారు. దాంతో తమ కుటుంబానికి నామినేటెడ్ పదవి ఏదీ ఇవ్వలేదని ఆయన రగులుతున్నారని టాక్. ఇక మరో వైపు పార్టీ పరంగా ఆయన కొందరు నాయకులతో విభేదిస్తున్నారు అంటున్నారు. అన్నీ కలసే ఆయన ఇలా జెడ్పీ మీటింగులో ఏకంగా రచ్చ చేయడానికి కారణం అయ్యాయని అంటున్నారు. మొత్తానికి విపక్ష బలం పెద్దగా లేకపోయినా అధికార పక్షమే విపక్షంగా మారడం, సాక్ష్తాత్తూ మంత్రిని టార్గెట్ చేయడంతో విశాఖ జెడ్పీ సమావేశం హీటెక్కిపోయింది. వైసీపీలో వర్గ పోరు అలా బట్టబయలు అయింది అంటున్నారు.