Begin typing your search above and press return to search.

రంగా కేసును తిర‌గ‌దోడుతున్నారా? వైసీపీలో కీల‌క చ‌ర్చ‌!

By:  Tupaki Desk   |   26 Dec 2022 2:05 PM GMT
రంగా కేసును తిర‌గ‌దోడుతున్నారా?  వైసీపీలో కీల‌క చ‌ర్చ‌!
X
రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన వంగ‌వీటి రంగా హ‌త్య కేసును తిర‌గ‌దోడాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం భావిస్తోందా? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు.. కాపు సామాజిక వ‌ర్గాన్ని, రంగా అభిమానుల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు, టీడీపీ, జ‌న‌సేన దూకుడును నిలువ‌రించేందుకు ఇంత‌కు మించిన ఆయుధం లేద‌ని భావిస్తోందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వైసీపీ నేత‌ల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా గుడివాడ ఎపిసోడ్‌లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర యుద్ధం సాగిన విష‌యం తెలిసిందే. ఎవ‌రికివారు రంగాను ఓన్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే, ఈ క్ర‌మంలో రంగా హ‌త్య‌ను.. నాటి ప‌రిణామాల‌ను వివ‌రిస్తూ.. మాజీ మంత్రి, గుడివాడ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి ఇన్నేళ్లుగా కొడాలి నాని.. ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఆనాటి హ‌త్య కేసులో ఎవ‌రెవ‌రున్నారు..? ఏం చేశారు? అంటూ.. పూస‌గుచ్చిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. ఇది నిజ‌మో.. కాదో తెలిసేలోగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ అయితే.. తెర‌మీదికి వ‌చ్చింది. ఇది జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఉమ్మ‌డి కృష్నాజిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కుల మ‌ధ్య ఈ కేసును తిర‌గ‌దోడినా తిర‌గ‌దోడొచ్చు! అనే మాట వినిపిస్తోంది.

రాజ‌కీయంగా పెను ప్ర‌కంప‌న‌లు సృష్టించిన రంగా హ‌త్య‌.. 1988, డిసెంబ‌రు 26న జ‌రిగింది. అప్ప‌ట్లోవిజ‌య‌వాడ‌ను ఏకంగా త‌గ‌ల‌బెట్టేశారు. ఆసియా ఖండంలో అప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి అని జాతీయ మీడియా పేర్కొంది. దాదాపు 52 రోజుల పాటు నిర‌వ‌ధిక క‌ర్ఫ్యూ విధించారు. త‌ర్వాత మ‌రో 21 రోజులు పాక్షిక క‌ర్ఫ్యూ విధించారు. అలాంటి ప‌రిణామం జ‌రిగిన ఈ కేసులో సాక్ష్యాలు లేవంటూ.. దిగువ కోర్టు కొట్టేసింది. ఇది సుదీర్ఘ విచార‌ణల త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామం.

అయితే.. ఇప్పుడు ఈ తేనెతుట్టెను క‌ద‌ప‌డం ద్వారా.. వైసీపీ రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు.. చాలా అవ‌కాశం ఉంద‌నేది వైసీపీ నేత‌ల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో తెలుస్తున్న విష‌యం. ప్ర‌జ‌ల్లోనూ ఈ కేసులో దోషులు ఎవ‌ర‌నేది ఇప్ప‌టికీ అంతుప‌ట్ట‌ని విష‌యంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ముందు.. రంగా హ‌త్య కేసును వెలికితీస్తే.. టీడీపీని డిపెన్స్‌లో ప‌డేయ‌డంతోపాటు.. ఇప్ప‌టి వ‌రకు కాపులు దూర‌మవుతున్నార‌న్న భావ‌న‌కు కూడా వైసీపీ చెక్ పెట్టే యోచ‌న ఉంద‌ని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు. మ‌రి వైసీపీ నిజంగానే కేసును వెలికితీస్తుందా? అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.