Begin typing your search above and press return to search.

ఎంఎల్ఏకి క్యాడర్ షాకిచ్చారా ?

By:  Tupaki Desk   |   29 July 2022 8:30 AM GMT
ఎంఎల్ఏకి క్యాడర్ షాకిచ్చారా ?
X
మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం మ్యూజికల్ ఛైర్ ఆట లాగ తయారైంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేయాలని ఎంఎల్ఏ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఇదే సమయంలో రాజీనామాచేయవద్దని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎంఎల్ఏతో పదే పదే భేటీలవుతున్నారు. అంటే ఒకవిధంగా రాజగోపాలరెడ్డిపై మానసికంగా ఒత్తిడి పెంచుతున్నారు. పీసీసీ స్ధాయిలో భేటీలవ్వటమే కాకుండా ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో కూడా ఫోన్లో మాట్లాడిస్తున్నారు.

ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు బీజేపీ నేతలు ఎంఎల్ఏతో రాజీనామా చేయించేందుకు ఒత్తిడిపెంచేస్తున్నారు. వెంటనే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని పదే పదే కమలనాథులు పట్టుబడుతున్నారు.

అయితే ఇపుడే రాజీనామాచేసే ఉద్దేశ్యంలో రాజగోపాల్ లేరట. ముందు పార్టీలో చేరి తర్వాతే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఎంఎల్ఏపై అన్నీవైపుల నుండి ఒత్తిళ్ళు బాగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే భవిష్యత్ కార్యాచరణపై మద్దతుదారులతో సమావేశమయ్యారు.

రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో మద్దతుదారులు రాజగోపాల్ కు పెద్ద షాకిచ్చారట. ఎంఎల్ఏ పార్టీ మారినా తాము మాత్రం కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతామని తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తాను బీజేపీలో చేరటంతో పాటు తన క్యాడర్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి కాంగ్రెస్ ను ఖాళీ చేయించాలన్నది ఎంఎల్ఏ ఆలోచన. తన సామర్ధ్యం ఇది అని బీజేపీ అగ్రనేతలకు రాజగోపాల్ చూపించదలచుకున్నారట. అయితే ఎంఎల్ఏ ఆలోచనలకు భిన్నంగా క్యాడర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

క్యాడర్ లేకుండా తాను మాత్రం బీజేపీలో చేరితే పెద్దగా ఉపయోగం ఉండదని రాజగోపాల్ కు బాగా తెలుసు. ఎందుకంటే రేపు రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే పనిచేయాల్సింది ఇదే క్యాడర్.

అయితే తనతో పాటున్న క్యాడర్ ఉపఎన్నికలో తనకు కాకుండా కాంగ్రెస్ అభ్యర్ధికే పని చేస్తే అప్పుడు గెలుపు కష్టమని ఎంఎల్ఏకి అర్ధమైపోయింది. హోరాహోరీగా జరగటం ఖాయమయ్యే ఉపఎన్నికలో ఒకవేళ రాజగోపాల్ ఓడిపోతే ఎంత అప్రదిష్ట వస్తుందో తెలియని కాదు. అందుకనే అందరు గందరగోళంలో పడిపోయారు.