Begin typing your search above and press return to search.

మునుగోడు ఉప ఎన్నిక త‌ప్ప‌దా.. బీజేపీ డ‌బుల్ గేమ్‌..!

By:  Tupaki Desk   |   25 July 2022 7:30 AM GMT
మునుగోడు ఉప ఎన్నిక త‌ప్ప‌దా.. బీజేపీ డ‌బుల్ గేమ్‌..!
X
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి రాజీనామా త‌ప్ప‌దా..? ఆయ‌న కాంగ్రెస్ ను వీడేందుకే క‌ట్టుబ‌డి ఉన్నారా..? రాజీనామా చేయ‌న‌ని చెబుతూనే ఉప ఎన్నిక కోరుకుంటున్నారా..? ఈ విష‌యంలో బీజేపీ డ‌బుల్ గేమ్ ఆడుతోందా..? త‌మ రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఉప ఎన్నిక‌లను ప్రోత్స‌హిస్తోందా..? జ‌మిలి ఎన్నిక‌ల విష‌యంలో వారి నిర్ణయాలు ఉత్త‌వేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

భార‌త దేశ ఎన్నికల నిర్వ‌హ‌ణ‌పై బీజేపీ మొద‌టి నుంచీ అసంతృప్తిగానే ఉంది. వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్ ఉండాల‌ని కోరుకుంటోంది. ఆ దిశ‌గా చ‌ర్య‌లు కూడా మొద‌లుపెట్టింది. పార్ల‌మెంటుకు ఒక‌సారి.. వివిధ రాష్ట్రాల‌కు మ‌రోసారి ఎన్నిక‌లు రావ‌డం వ‌ల్ల స‌మ‌యం వృథాతో పాటు కొన్ని వేల కోట్లు అద‌న‌పు ఖ‌ర్చు అవుతోంద‌ని బీజేపీ భావిస్తోంది. దీనిని నివారించేందుకు జ‌మిలి ఎన్నిక‌ల‌ను ముందుకు తెచ్చింది. దీని కోసం దేశంలోని అన్ని రాజ‌కీయ ప‌క్షాల అభిప్రాయాలు సేక‌రించింది.

జ‌మిలి ఎన్నిక‌లపై కొన్ని పార్టీలు విమ‌ర్శించినా లోక్ స‌భ‌లో, రాజ్య‌స‌భ‌లో బీజేపీకి మెజారిటీ ఉంది క‌నుక ముందుకే సాగాల‌ని నిర్ణ‌యం తీసుకొంది. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన అంశం లా క‌మిష‌న్ ప‌రిధిలో ఉంది. అది కూడా సానుకూలంగా స్పందిస్తే ఇక పార్ల‌మెంటులో బిల్లు పెట్ట‌డ‌మే త‌రువాయి అవుతుంది. అయితే ఒక‌వైపు జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఇంత క‌స‌ర‌త్తు చేస్తున్న బీజేపీ మ‌రోవైపు ఉప ఎన్నిక‌ల‌ను ప్రోత్స‌హించి అభాసుపాల‌వుతోంది.

ఇత‌ర రాష్ట్రాల్లో త‌మ రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఆ ప‌నిని దిగ్విజ‌యంగా ముగించిన బీజేపీ తాజాగా తెలంగాణ‌పై దృష్టి సారించింది. తొలుత దుబ్బాక‌లో అనుకోకుండా వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందిన బీజేపీ త‌ర్వాత హుజూరాబాద్ ను త‌మ ఖాతాలో వేసుకుంది. భూముల క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో ఈటెల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంతో ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో డ‌బ్బులు ఏరులై పారిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష బీజేపీ కొన్ని వంద‌ల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేశాయి. ఈటెల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండా బీజేపీకి బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇచ్చినా స‌రిపోయేది. ఉప ఎన్నిక అనివార్యం అయ్యేది కాదు. కానీ బీజేపీ ఆయ‌న‌తో రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ను ప్రోత్స‌హించింది. ఫ‌లితం ఎలా ఉన్నా కొన్ని వంద‌ల కోట్ల ప్ర‌జాధ‌నం వృధా అయింది.

ఇపుడు మ‌ళ్లీ మునుగోడుపై క‌న్నేసింది. కాంగ్రెస్ పార్టీపై ఎప్ప‌టి నుంచో అసంతృప్తిగా ఉన్న కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది. స్వ‌యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ఈ దిశ‌గా పురిగొల్పిన‌ట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఏక కాలంలో అటు టీఆర్ఎస్ ను, ఇటు కాంగ్రెస్ ను దెబ్బ‌కొట్టి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్ గా మార్చాల‌ని భావిస్తోంది.

ఇక్క‌డ క‌నుక ఉప ఎన్నిక అనివార్య‌మైతే హుజూరాబాద్ ను మించి ఖ‌ర్చు అయ్యే అవ‌కాశం ఉంది. టీఆర్ఎస్ కూడా అందుకు సిద్ధంగానే ఉంది. బీజేపీ ఖ‌ర్చు త‌గ్గింపు పేరిట జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతూనే ఇలా ఉప ఎన్నిక‌ల‌ను ప్రోత్స‌హించి అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చు చేయించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!