Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధినాయకత్వానికి కోమటిరెడ్డి భారీ ఆఫర్

By:  Tupaki Desk   |   22 Feb 2021 9:43 AM GMT
కాంగ్రెస్ అధినాయకత్వానికి కోమటిరెడ్డి భారీ ఆఫర్
X
గడిచిన కొద్దికాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త రథసారధిని ఎంపిక చేసే విషయంలో సాగుతున్నజాగు తెలిసిందే. మొన్నామధ్యన ఇంకేముంది.. రేపో మాపో కొత్త సారథి పేరును ప్రకటిస్తున్నారన్న వేళ.. సీన్లోకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగే వరకూ పాత అధ్యక్షుడు ఖాతాను కొనసాగించాలని కోరారు. ఉప ఎన్నిక తర్వాతే ఎంపిక చేయాలన్న సూచన చేశారు.

దీంతో.. అప్పటివరకు టీకాంగ్రెస్ రథసారధి లెక్క తేల్చేయాలని భావించిన కాంగ్రెస్ కామ్ అయ్యింది. దీంతో.. కాంగ్రెస్ నేతలు ఎవరికి వారుగా..ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమకే చీఫ్ పదవి ఇవ్వాలని.. ఇస్తే పార్టీని అలా చేస్తా.. ఇలా చేస్తానని చెబుతున్న వేళ.. ఈ పదవిని మొదట్నించి ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన ఆయన.. పీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇచ్చినా పని చేస్తానని.. అదే తనకే ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందరిని వెనక్కి తీసుకొస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం కొత్త రాష్ట్రాన్ని సాధించుకుంటే కేసీఆర్ సర్కారు అదేమీ చేయలేదని మండిపడ్డారు. హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల్ని పట్టపగలే హత్య చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆరు శాఖల్ని అప్పగించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వంద మంది ఐఏఎస్ లకుపని లేకుండా కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. సీఎస్ సోమేశ్ కుమార్ సైతం జైలుకు వెళతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. మరి.. ఆయన ఆఫర్ కు కాంగ్రెస్ అధినాయకత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.