Begin typing your search above and press return to search.

వెళ్లే ముందు కోమటి రెడ్డి ఓపెన్ గా మాట్లాడేశారా?

By:  Tupaki Desk   |   4 Jun 2016 12:56 PM GMT
వెళ్లే ముందు కోమటి రెడ్డి ఓపెన్ గా మాట్లాడేశారా?
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి తెలంగాణ అధికారపక్షంలో నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లిపోతున్నట్లుగా వాదనలు జోరుగా వినిపిస్తున్న వేళ.. ఆయన ఆ విషయం మీద పెదవి విప్పకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంచలన వ్యాఖ్యలు చేయటమే కాదు.. పీసీసీ అధ్యక్షుల ఎంపికలో జరుగుతున్న తప్పుల్ని ఓపెన్ గా ఎత్తి చూపిన ఆయన.. కాంగ్రెస్ అధినాయకత్వంపై చాలానే ప్రశ్నలు సంధించారు. తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయకపోతే పార్టీని పోస్ట్ మార్టం చేసే పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్థుడిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభివర్ణిస్తూ మండిపడ్డారు.

పార్టీ వరుస ఓటములకు కారణం వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాల్సిందని ఉత్తమ్ కు సూచించిన ఆయన.. పార్టీ నాయకులు సీరియస్ గా ఉప ఎన్నికల్ని తీసుకోకపోవటం వల్లనే పార్టీ ఓడిందంటూ వ్యాఖ్యానించారు. తానే కనుక పీసీసీ చీఫ్ అయి ఉంటే ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించటమో లేదంటే తన పదవికి రాజీనామా చేసే వాడినన్నారు. ఉత్తమ్ కుమార్ నాయకత్వంలోనే సాధారణ ఎన్నికల్లోకాంగ్రెస్ ఓటమి పాలైందని.. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితిపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాస్తానని చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలంటూ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్న వెంకటరెడ్డి.. గాంధీభవన్ లోకూర్చొని ప్రెస్ మీట్లు పెడితే ఓట్లు రాలవన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడే ప్రకటిస్తే మంచిదన్న ఆయన.. ఇప్పటికే రాష్ట్రంలోని 15 నుంచి 20 మద వరకు కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు తామే సీఎం అభ్యర్థిగా ఫీలవుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. మొత్తానికి తన ఘాటైన వ్యాఖ్యలతో కోమటి రెడ్డి వెంకటరెడ్డి కలకలం సృష్టించటమేకాదు.. పార్టీ విడిచి పెట్టి వెళుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం గురించి మాత్రం మాట మాత్రం మాట్లాడకుండానే పార్టీ తీరును దుమ్మెత్తిపోయటం విశేషంగా చెప్పాలి. కోమటిరెడ్డి మాటలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడుపడనివిగా ఉన్నప్పటికీ.. ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని చెప్పాలి.