Begin typing your search above and press return to search.

హోం క్వారంటైన్ లో ఆ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే?

By:  Tupaki Desk   |   20 March 2020 2:42 PM GMT
హోం క్వారంటైన్ లో ఆ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే?
X
కరోనా మహమ్మారి భారత్ లో శరవేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల వద్ద భారీగా స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం అనుమానం ఉన్నా క్వారంటైన్ కు తరలించి...14 రోజుల పాటు ఉంచుతున్నారు. టెస్టుల్లో నెగెటివ్ అని తేలితేనే ఇంటికి పంపుతున్నారు. అయితే, తాజాగా బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు ఎయిర్ పోర్టులో టెస్టులు నిర్వహించినపుడు కరోనా లక్షణాలేమీ లేవు. అయితే, ఆ తర్వాత నాలుగు రోజులకు ఆమెకు ఫ్లూ లక్షణాలు రావడంతో కరోనా టెస్టులు చేయించుకుంది. ఆమెకు కరోనా పాజిటివ్ అని టెస్టుల్లో తేలింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణకు చెందిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను 14 రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు. దీంతో, ఎయిర్ పోర్టు దగ్గర వైద్యపరీక్షల్లో కరోనా లక్షణాలు లేనప్పటికీ...కోనప్ప హోం క్వారంటైన్ లో ఉన్నారు.

సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇటీవల అమెరికా వెళ్ళి 40 రోజులు అక్కడ ఉండి వచ్చారు. కోనప్పకు శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించగా ఏమీ లేదని తేలింది. దీంతో, ఆయనను ఇంటికి పంపించారు. ఆ తర్వాత కోనప్ప పలు కార్యక్రమాలకు హాజరయ్యారు కూడా. అయితే, తాజాగా తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోనప్పను హోం క్వారెంటైన్ చేశారు. దీంతో, ఆయనకు కరోనా సోకిందా అంటూ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, 14 రోజుల పాటు హోం క్వారెంటైన్ కావాలన్న జిల్లా వైద్య అధికారుల సలహాను తాను పాటిస్తున్నానని - సీఎం కేసీఆర్ సూచన ప్రకారమే స్వయంగా హోం క్వారెంటైన్ అయ్యానని చెప్పారు కోనప్ప. తనకు కరోనా లక్షణాలు లేవని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని కోనప్ప అంటున్నారు. తనకు కరోనా సోకిందన్న వదంతులను నమ్మొద్దని కోనప్ప చెబుతున్నారు. అందుకే, అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు. కరోనా నేపథ్యంలో....అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ...క్వారంటైన్ చేస్తున్నారు వైద్యాధికారులు.