Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. పార్టీకి కాదు దేవుడికి తిప్ప‌లు..!

By:  Tupaki Desk   |   1 Dec 2022 12:38 PM GMT
ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. పార్టీకి కాదు దేవుడికి  తిప్ప‌లు..!
X
వైసీపీలో ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యేల వివాదం.. కామ‌న్గానే సాగుతోంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ స‌మ‌స్య ఉంది. అయితే.. ఇలాంటివి రాజ‌కీయంగా దుమారం రేప‌డం స‌హ‌జమే. కానీ, ప్రకాశం జిల్లా ముండ్లమురు మండలం కొమ్మవరం గ్రామ వైసీపీలోని వర్గపోరు ప్రభావం భగవంతునికి తాకింది. మండలంలోని ఈదర పంచాయతీ పరిధి కొమ్మవరంలో గ్రామస్తులు ఒక్కటై రూ.50లక్షలతో నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రకాశం జిల్లా ముండ్లమురు మండలం కొమ్మవరం ప్రాంతం ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌స్తుంది. ఇక్క‌డ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌కు, మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఇక్క‌డ నిర్మించిన ఆల‌యానికి కార్య‌వ‌ర్గంగా ఉన్న‌వారు.. మా నాయ‌కుడు చేతుల మీదుగా ప్రారంభించాలి.. అంటే కాదు.. మా నాయ‌కుడి చేతుల మీదుగా ఆల‌యాన్ని ప్రారంభించాల‌ని ప‌ట్టు బ‌డుతున్నారు.

వాస్త‌వానికి ఆల‌య క‌మిటీలో ఉన్న‌వారు క‌లిసే ఉండేవారు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు రావటంతో.. ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లికి చెందిన వారు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో ఆలయ పునఃప్రారంభ వేడుకలకు త‌మ నాయ‌కుడిని పిల‌వాలంటే.. త‌మ నాయ‌కుడినే పిల‌వాలంటూ.. వారు ప‌ట్టుబ‌ట్టారు. దీనిపై ఎవ‌రూ కూడా ఒక నిర్ణ‌యానికి రాలేదు. ఫ‌లితంగా ఈ ఆల‌యం అలానే ఉండిపోయింది.

గ్రామంలో ఉన్న ఒక్క దేవాలయంలో నిత్య కృత్యాలైన ధూప, దీప, నైవేద్యాలు స్వామి వారికి సమర్పించా లి. అలా చేయక పోవటం వలన గ్రామానికే అరిష్టం అని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఇరువర్గాలు వైషమ్యాలు మాని భగవంతుని కార్యక్రమానికి అందరూ కలసి కట్టుగా ముందుకి రావాలని, పంతాలు వీడి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నా.. నాయ‌కుల మ‌ధ్య ఏర్ప‌డిన వివాదాలు.. మాత్రం అలా చేసేందుకు అంగీక‌రించ‌డం లేదు. సో.. వైసీపీలో ఉన్న వివాదాలకు ఇది అద్దం ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.