Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి కామెంట్.. ప్ర‌శంసా? స‌టైరా?! హాట్ టాపిక్ గురూ!

By:  Tupaki Desk   |   10 Sep 2022 3:17 PM GMT
జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి కామెంట్.. ప్ర‌శంసా?  స‌టైరా?! హాట్ టాపిక్ గురూ!
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పై వైసీపీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. ఆయ‌నను దేవుడ‌ని ఒక‌రంటే.. జాతిర‌త్న‌మ‌ని.. మ‌నిపూస అని మ‌రికొంద‌రు అంటున్నారు. అయితే.. న‌దుల దారి మొత్తం సముద్రంలోకే అన్న‌ట్టుగా.. నాయ‌కులు ఎవ‌రు ఎలాంటి కామెంట్లు చేసినా.. అధినేత‌ను మ‌చ్చిక చేసుకునేందుకే అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే.. తాజాగా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్.. సొంత పార్టీలోనే కొన్నాళ్లుగా అసంతృప్తి స్వ‌రం వినిపిస్తున్న న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి ఆస‌క్తిగా స్పందించారు.

దేశ ప్ర‌ధాన మంత్రి రేసులో మ‌న సీఎం జ‌గ‌న్ కూడా ఉన్నార‌ని.. అనేశారు. వాస్త‌వానికి దేశంలోని బీజేపీయేత‌ర ప్రాంతీయ పార్టీలు ఉన్న ప్ర‌బుత్వాలు.. కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌నేది ఇప్ప‌టి ముచ్చ‌ట కాదు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌దాన మంత్రి ప‌ద‌వే వీరికి ప‌ట్టు..బెట్టుగా మార‌డంతో ఈ ప్ర‌య‌త్నాలు ఎప్ప‌టిక‌ప్పుడు విక‌టించాయి. అయితే..ఇప్పుడు గ‌ట్టి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. మోడీకి వ్య‌తిరేకంగా కేసీఆర్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ, కేజ్రీవాల్‌, నితీష్ కుమార్ ఇలా కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. జ‌గ‌న్ పేరు ఎక్క‌డా వినిపించ‌లేదు.

ఎందుకంటే.. ఆయ‌న ప్ర‌ధాని మోడీకి న‌మ్మిన బంటుగా ఉన్నార‌నేటాక్ ఉండ‌డ‌మే. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య సంచ‌ల‌నంగా మారింది. దీనిని కాద‌ని అన‌డానికి కూడా అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అయితే.. జ‌గ‌న్‌పైనా.. వైసీపీ సీనియ‌ర్ నేత‌ల‌పైనా ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి.. ఈ వ్యాఖ్య చేయ‌డంపై.. అక్క‌సుతో ఇలా వ్యాఖ్యానించారా? అనే చ‌ర్చ కూడా ఉంది. మొద‌టి విష‌యానికి వ‌స్తే.. కేంద్రం నుంచి కొన్నాళ్లు బాగానే ఏపీకి స‌హ‌కారం ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కోరిన‌ట్టు కేంద్రం చేయ‌డం లేదు.

ఎంపీ ర‌ఘురామ‌పై వేటు వేయాల‌న్నారు. పోల‌వ‌రం నిధులు పెంచాల‌న్నారు. దిశ చ‌ట్టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల‌ని కోరారు. అప్పులు చేసుకుంటున్నాం.. అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరారు. అయితే..అ ప్పుల విష‌యంలో ఒకింత అనుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ.. మిగిలిన విష‌యాల్లో మాత్రం కేంద్రం నుంచి స‌హ‌కారం లేదు. మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ.. త‌ట‌పటాయిస్తోంది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో జ‌గ‌న్ కూడా బీజేపీకి దూర‌మ‌య్యే ప్ర‌య‌త్నం చేయొచ్చున‌నేది విశ్లేష‌కుల అంచనా. సో.. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ప్ర‌స‌న్న కుమార్ చెప్పిన‌ట్టు మోడీ వ్య‌తిరేక జ‌ట్టులో జ‌గ‌న్ చేరితే ప్ర‌ధాని ప‌ద‌వికోసం.. పోటీ ప‌డే ఛాన్స్‌ను కొట్టి పారేయ‌లేం.

ఇక‌, రెండో విష‌యానికి వ‌స్తే.. మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తిగా ఉండ‌డంతోపాటు.. స్తానికంగా కొంద‌రు త‌న‌కు అధికార పార్టీ నాయ‌కులే అడ్డు ప‌డుతున్నార‌ని.. ప్రసన్నకుమార్ ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై ఉద్దేశ పూర్వ‌కంగానే ఆయ‌న ఇలా స‌టైర్ పేల్చారా? అనేది కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. అయితే.. ఇందులో ఏది నిజ‌మో.. కాదో తెలియ‌దు కానీ.. ప్ర‌స‌న్న కుమార్ చేసిన వ్యాఖ్య‌లు మాత్రం వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై మిగిలిన నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.