Begin typing your search above and press return to search.

ఏడుసార్లు గెలిచా టికెటివ్వరా.. బాబుపై ఆగ్రహం

By:  Tupaki Desk   |   15 March 2019 5:43 AM GMT
ఏడుసార్లు గెలిచా టికెటివ్వరా.. బాబుపై ఆగ్రహం
X
టీడీపీలో టికెట్ల కేటాయింపుతో రచ్చ మొదలైంది. విజయనగరంలో జిల్లా టీడీపీలో టికెట్ల రగడ పెచ్చుమీరింది. ముఖ్యంగా చంద్రబాబు వైఖరిపై ఆ పార్టీ సీనియర్ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. బీసీలకు టికెట్లు కేటాయించడంలో చంద్రబాబు నిర్లక్ష్యాన్ని పార్టీ నేతలు ఎత్తిచూపుతున్నారు.

తాజాగా విజయనగరం జిల్లాలో టీడీపీ సీనియర్ - నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీటు ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల వయసులో ఐదు రోజులుగా సీఎం చంద్రబాబు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నానని వాపోయాడు. కనీసం తన వయసుకు కూడా బాబు గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ఇక నెల్లిమర్ల అసెంబ్లీ సీటును నారాయణ స్వామికి ఇచ్చే అవకాశం ఉన్నా పోటీ తీవ్రంగా ఉంది. భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగార్రాజు - ఆనంద్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కడగల ఆనంద్ కుమార్ నెల్లిమర్ల సీటును ఆశిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో చంద్రబాబు పెండింగ్ లో పెట్టారు.తాను.. లేకపోతే తన కుమారుడు అప్పలనాయుడికి టికెట్ ఆశిస్తున్నట్టు పతివాడ తెలిపారు.

ఇక టీడీపీలో మరో బీసీ మహిళ ఎమ్మెల్యే మీసాల గీత టికెట్ ను బాబు పెండింగ్ లో పెట్టారు. ఇక మీసాల గీతకు టికెట్ ఇవ్వకుండా అశోక్ గజపతి రాజు తన కుమార్తె అదితికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గీత ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానంలో బీసీ అయిన గీతకు ఇవ్వకుండా అశోక్ గజపతి అడ్డుపడుతున్నారు. ఇలా బీసీలపై చిన్న చూపు చూస్తున్న చంద్రబాబు తీరుపై ఆ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.