Begin typing your search above and press return to search.

జేసీ ట్రావెల్స్ ఫోర్జ‌రీ కేసు.. ఛార్జ్‌షీట్ మాయం.. వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   3 Jan 2023 5:30 PM GMT
జేసీ ట్రావెల్స్ ఫోర్జ‌రీ కేసు.. ఛార్జ్‌షీట్ మాయం.. వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన `జేసీ ట్రావెల్స్‌.. బ‌స్సుల రిజిస్ట్రేష‌న్‌` కేసు మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడుగా ఉన్న అనంత‌పురంజిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు..జేసీ బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చుట్టూ.. ఇప్పుడు తాజాగా మరో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. స‌ద‌రు కేసుకు సంబంధించి   ఛార్జ్ షీటును జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాయం చేశారంటూ.. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వాస్త‌వానికి ఈ ఫోర్జ‌రీ కేసులో అసోం, నాగాలాండ్ రాష్ట్రాల‌కు చెందిన అధికారుల ప్ర‌మేయం కూడా ఉంద‌నేది తెలిసిందే. దీంతో ఏపీలో ఈ వ్య‌వ‌హారం .. రాజ‌కీయ ర‌చ్చ‌కు సైతం దారితీసింది. జేసీ ప్ర‌భాక‌ర్‌ను అరెస్టు చేయ‌డం.. అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. `జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ` కేసు ఛార్జిషీట్ మాయం అయ్యిందని బాంబు పేల్చారు. తాడిపత్రి కోర్టులో ఇది కనిపించడం లేద‌ని చెప్పారు. మొత్తం 600 పేజీలతో దాఖ‌లు చేసిన ఈ  ఛార్జిషీట్ అదృశ్యమైందని అన్నారు.


ఛార్జిషీట్ మాయం వెనుక జేసీ ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని పెద్దారెడ్డి ఆరోపించారు. 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు లంచం ఇచ్చి ఛార్జిషీట్ మాయం చేయించారని తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. అదేస‌మ‌యంలో ఈ వ్య‌వ‌హారం వెనుక తాడిపత్రి కోర్టు సిబ్బంది ప్రమేయం కూడా ఉంద‌ని ఆరోపించారు. జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌న్న భయంతోనే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఛార్జిషీట్‌ను చోరీ చేయించారన్నారు. జేసీ ట్రావెల్స్ కేసు ఛార్జిషీట్ అదృశ్యం పై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

అస‌లేంటీ కేసు?

జేసీ కుటుంబంపై రెండు త‌రాలుగా ట్రావెల్స్ రంగంలో ఉంది. ఈ క్ర‌మంలో సీమ‌లోనే కాకుండా.. రాష్ట్రంలోనే జేసీ ట్రావెల్స్‌కు మంచి పేరుంది. అయితే.. గ‌తంలో సుప్రీంకోర్టు ప‌ర్యావ‌ర‌ణ కాలుష్య నియంత్ర‌ణ కింద‌ బీఎస్‌-3 వాహనాలను నిషేధించింది. దీంతో ఆయా వాహ‌నాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి.. వాటిని బీఎస్‌-4 వాహనాలుగా ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రర్ చేయించారని అభియోగాలు వచ్చాయి.

ఈ వాహనాల రిజిస్ట్రేషన్‌ల కోసం నకిలీ బీమా పాలసీలనూ సృష్టించారని.. నాగాలాండ్‌లో NOC తీసుకుని ఏపీకి తీసుకొచ్చినట్లు ఆరోపణలు వినిపించాయి. ఇదే కేసులో ఈడీ సోదాలు చేయగా.. కొద్ది నెలల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి విచారణకు కూడా హాజరయ్యారు. ఈ మధ్యే ఇదే కేసులో ఈడీ జేసీ కుటుంబంతో పాటూ, ఇతర సంస్థలకు చెందిన రూ. 22.10 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.  జేసీ ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి కార్యాలయంలో సీబీఐ అధికారులు తనిఖీలు చేసి పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.  ఈ క్ర‌మంలోనే చార్జిషీట్‌ను కూడా దాఖ‌లు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.