Begin typing your search above and press return to search.

అవును.. ఆ ఎమ్మెల్యే ఆస్తుల్ని జఫ్తు చేశారు

By:  Tupaki Desk   |   1 March 2016 9:59 AM IST
అవును.. ఆ ఎమ్మెల్యే ఆస్తుల్ని జఫ్తు చేశారు
X
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఒక ఎమ్మెల్యే ఆస్తుల్ని పోలీసులు జఫ్తు చేశారు. రాజకీయంగా పలుకుబడి ఉండే ఎమ్మెల్యే ఆస్తుల్ని పోలీసులు జఫ్తు చేయటమా? అనిపించొచ్చు కానీ.. అయ్యగారు చేసిన వెధవ పనికి ఆ మాత్రం శిక్ష తప్పదు. మైనర్ బాలికను రేప్ చేసిన ఉదంతంలో ఆరోపణలతో పాటు.. కేసు చిక్కులు ఎదుర్కొంటున్న బీహార్ ఎమ్మెల్యే రాజ్ భల్లవ్ యాదవ్ కు చెందిన ఆస్తుల్ని జఫ్తు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

వ్యవభిచార వ్యాపారం చేసే ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు.. ఆమె ఇచ్చిన నేరాంగీకార ప్రకటన ఆధారంగా చేసుకొని సదరు ఎమ్మెల్యేపై అత్యాచార కేసును నమోదు చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో సదరు ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారు. దీంతో.. అతగాడి మీద తీసుకోవాల్సిన చర్యలపై కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేస్తు.. ఎమ్మెల్యే ఆస్తుల్ని జఫ్తు చేయాలని ఆదేశించింది. దీంతో.. నలందా.. నెవడా పోలీసు స్టేషన్లకు చెందిన అధికారులు ఎమ్మెల్యే సొంతూరుకి వెళ్లి ఆయన ఆస్తులు జఫ్తు చేశారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే ఇదే మరి.