Begin typing your search above and press return to search.

నోరు జారి కేసీఆర్ ను అంత మాట అనేసిన రాజయ్య

By:  Tupaki Desk   |   3 Oct 2021 7:30 AM GMT
నోరు జారి కేసీఆర్ ను అంత మాట అనేసిన రాజయ్య
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సర్కారు కొలువు తీరిన వేళ.. ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిన నేతల్లో రాజయ్య ఒకరు. అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించటం.. దీనిపై దళిత సంఘాలు.. నేతలు.. పలువురు మేధావులు అదే పనిగా విరుచుకుపడటం.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఒకదశలో ముందస్తు (సాంకేతికంగా కాదనుకోండి) ఎన్నికలు జరిగిన 2018లో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదన్న వాదన వినిపించినా.. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం ఆయనకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇచ్చారు.

అంచనాలకు తగ్గట్లే ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు. అప్పటి నుంచి తనకంటూ పదవి కోసం రాజయ్య పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ ఆయనకు కాలం కలిసి రావటం లేదు. తనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన వేళలో.. కేసీఆర్ మీద గుర్రు ప్రదర్శించిన రాజయ్య.. ఆ తర్వాతి కాలంలో సారు పెద్ద మనసు చేసుకొని తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ ప్రయత్నాలు షురూ చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అనుకోని దెబ్బ పడింది. కేసీఆర్ మనసున్న మారాజు అంటే పొగడ్తల వర్షం కురిపించసాగారు. ప్రసవానికి ఉచిత అంబులెన్సు మొదలు..పిల్లలు పుట్టిన తర్వాత వారికి డబ్బులు ఇవ్వటమే కాదు.. కేసీఆర్ కిట్టు గురించి గొప్పలు చెప్పారు.

అధినేతను అదే పనిగా పొగిడే పనిలో భాగంగా ఆయన నోటి నుంచి అనుకోని రీతిలో రాకూడని మాట వచ్చేసింది. దీనికి లింగాలఘణపురం మండల కేంద్రం వేదికైంది. ఇంతకీ తాటికొండ రాజయ్య ఏమన్నారన్నది ఆయన నోటి మాటల్లోనే చెబితే.. ''సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు అని నేను ఎందుకు అంటున్నానంటే కాన్పు అయిన తల్లికి కొత్తబట్టలు అయ్యవ్వలు తెత్తలేరు.. మొగడు తీసుకొస్తలేరు.. అత్తమామలు తీసుకొస్తలేరు. ఇలాంటి పరిస్థితుల్లో అత్తమామ కేసీఆరే అయితున్నాడు..

అమ్మా, అయ్యా కేసీఆరే అయితుండు.. భర్త కూడా అయినే అయిపోయి ఇయ్యాల మొత్తం చీరలు, బట్టలు సర్వం అందిస్తున్నాడు'' అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆడపిల్లకు అమ్మ.. నాన్న.. అత్త.. మామ అవుతున్నాడు అన్న వరకు ఓకే. కానీ.. భర్త కూడా అయినే అయిపోతున్నాడంటూ నోరు జారిన వైనం వివాదంగా మారింది. ఇప్పుడీ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. నాలుగు పొగడ్తలతో బాస్ మనసు గెలుచుకోవాలన్న రాజయ్య ప్రయత్నం బ్యాక్ ఫైర్ అయిన పరిస్థితి. కాలం కలిసి రాకపోతే ఇలానే ఉంటుంది మరి.