Begin typing your search above and press return to search.

రాజోలులో రాపాక‌కు షాక్.. వైఎస్సార్సీపీకి కీల‌క నేత‌ల రాజీనామా!

By:  Tupaki Desk   |   19 Jun 2022 2:30 PM GMT
రాజోలులో రాపాక‌కు షాక్.. వైఎస్సార్సీపీకి కీల‌క నేత‌ల రాజీనామా!
X
కోన‌సీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావుకు తీవ్ర షాక్ త‌గిలింది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీతో అంట‌కాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజోలు నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి బాధ్య‌త‌ల‌ను వైఎస్సార్సీపీ రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కే అప్ప‌గించింది. దీన్ని నిర‌సిస్తూ నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్సీపీ కీల‌క నేత‌లు రాజీనామాల బాట ప‌ట్టారు.

రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీకి వేల మంది నాయ‌కులు ఉన్నార‌ని.. వాళ్ల‌లో ఎవ‌రూ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి ప‌ద‌వికి ప‌నికిరారా అని నేత‌లు నిల‌దీస్తున్నారు. వేరే పార్టీ నుంచి వ‌చ్చిన రాపాక‌ను నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జిగా అంగీక‌రించే ప్ర‌స‌క్తే లేద‌ని కుండ‌బ‌ద్దలు కొట్టారు. వైఎస్సార్సీపీ అధిష్టానం ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ఆ పార్టీకి రాజీనామాలు స‌మ‌ర్పించారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాగి రామ‌రాజుతోపాటు నియోజ‌క‌వ‌ర్గ బూత్ క‌మిటీ ఇన్చార్జి సుంద‌ర‌పు బుల్ల‌బ్బాయి తమ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. దీంతో కీల‌క నేత‌ల రాజీనామాతో వైఎస్సార్సీపీకి తీవ్ర షాక్ త‌గిలింది.

రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు జ‌న‌సేన నుంచి వైఎస్సార్సీపీలో చేరాక.. వైఎస్సార్సీపీ నేత‌ల‌పైనే త‌ప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని అస‌మ్మ‌తి నేత‌లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేత‌ల‌ను కాకుండా జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల‌కు ప‌ద‌వులు అప్ప‌గిస్తున్నార‌ని, ప‌నులు కూడా వారికే చేసి పెడుతున్నార‌ని అస‌మ్మ‌తి నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా 2009లో రాజోలు నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన రాపాక 2019లో జ‌న‌సేన త‌ర‌ఫున గెలుపొందారు. ఆ త‌ర్వాత తాను అధికార పార్టీలో చేర‌న‌ని.. జ‌న‌సేన‌లో ఉంటాన‌ని రాపాక చెప్పిన సంగ‌తి తెలిసిందే. వైఎస్సార్సీపీలో చేరితే తాను ఆ పార్టీలో 152వ ఎమ్మెల్యేగా ఉంటాన‌ని.. అదే జ‌న‌సేన పార్టీలోనే ఉంటే ఆ పార్టీ త‌ర‌ఫున ఏకైక ఎమ్మెల్యేగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అలాంటి రాపాక ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీలో చేరిపోయారు.