Begin typing your search above and press return to search.

బాలయ్య పేరు చెప్పినా విననన్నమంత్రి ??

By:  Tupaki Desk   |   1 March 2017 10:32 AM GMT
బాలయ్య పేరు చెప్పినా విననన్నమంత్రి ??
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బామ్మర్ది, సినీ నటుడు బాలయ్య మాట ప్రభుత్వంలో కూడా చెల్లుబాటు అవుతోందన్నది ఇంతవరకు ఉన్న టాక్. కానీ.. తాజాగా ఓ మంత్రి వ్యవహారంతో అదంతా ఒట్టిమాటేనని.. ఎవరో కొందరు మంత్రులు మాత్రమే బాలయ్యకు వేల్యూ ఇస్తున్నారని, మిగతావారు అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తాజాగా విశాఖలో జరిగిందని చెబుతున్న ఓ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. దీనికి సంబంధించి పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి..

ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన ఓ డిస్ట్రిబ్యూటర్ విశాఖలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలనుకున్నారు. నగర శివారులో భారీగా 25 ఎకరాల్లో వెంచర్ ప్లాన్ చేశారు. అందులో వ్యవసాయ భూములు ఉండడంతో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు అవసరమైన అనుమతులు కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించారు. పక్కా డాక్యుమెంట్లతో దరఖాస్తు సమర్పించినా పని కాలేదు. దీంతో చేయి తడపనిదే పనులు చేయరని భావించిన సదరు డిస్ట్రిబ్యూటర్ నేరుగా ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి కావాలంటే అంతో ఇంతో ఇస్తాం. పనిచేసిపెట్టండి అని వేడుకున్నారు. అప్పుడు రెవెన్యూ ఉన్నతాధికారి అసలు విషయం చెప్పారు. మంత్రిగారికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇక్కడ వెంచర్‌ వేయడం అసాధ్యమని చెప్పారు. సరే తప్పదు కదా అనుకుంటూ ఆయన మంత్రిగారి వద్దకు వెళ్లారు.

మంత్రిగారు నిర్మొహమాటంగా నాలుగు కోట్లు డిమాండ్ చేశారట. అంత ఇచ్చుకోలేనన్న డిస్ట్రిబ్యూటర్ కోటి ఇస్తానని అన్నారట. మంత్రి ఒక మెట్టు దిగి 3 కోట్లకు డీల్ ఫిక్సు చేసి అంతకంటే పైసా తక్కువైనా పని కాదని చెప్పేశారు. దాంతో డిస్ట్రిబ్యూటర్‌ తాను బాలకృష్ణ స్నేహితుడినని చెప్పారు. అయితే.. మంత్రి మాత్రం అయినా ఇవ్వక తప్పదని తేల్చేశారట. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆ పంపిణీదారుడు బాలయ్యను కలవడానికి ట్రై చేశారు. విషయం తెలిసిన మంత్రి మళ్లీ ఆయన్ను పిలిపించి ఫుల్లుగా వార్నింగు ఇచ్చారని టాక్. బాలకృష్ణకు చెబితే అసలు అనుమతులే రాకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారట. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ 3 కోట్లు సమర్పించుకున్నారట.