Begin typing your search above and press return to search.

లోకేశ్ ప‌ప్పు కాద‌ట‌!... గ‌న్నేరు ప‌ప్పు అట‌!

By:  Tupaki Desk   |   28 Feb 2019 9:57 AM GMT
లోకేశ్ ప‌ప్పు కాద‌ట‌!... గ‌న్నేరు ప‌ప్పు అట‌!
X
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న నారా లోకేశ్ పై విప‌క్షాలకు చెందిన నేత‌లు సెటైర్ల మీద సెటైర్లేస్తున్నారు. మంత్రిగా, ఓ జాతీయ పార్టీ అధినేత కుమారుడిగా లోకేశ్ కు ఉండాల్సిన ల‌క్షణాల్లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేవ‌న్న కోణంలో వ‌చ్చి ప‌డుతున్న ఈ విమ‌ర్శ‌ల‌కు లోకేశ్ నిజంగానే దెబ్బైపోతున్నార‌ని చెప్పక త‌ప్ప‌దు. అంతేకాదండోయ్‌... త‌న‌దైన నాలిక మ‌డ‌త వ్యాఖ్య‌ల‌తో త‌న‌ను తానే టార్గెట్ చేసుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్న లోకేశ్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్‌, చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా విరుచుకుప‌డుతున్న తీరు నిజంగానే ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి. ఇప్ప‌టికే లోకేశ్ ను ఎంత‌గా టార్గెట్ చేయాలో అంత‌కంటే కాస్తంత ఎక్కువ‌గానే చేసిన రోజా... తాజాగా ఆయ‌న‌పై మ‌రో ఆస‌క్తిక‌ర సెటైర్ సంధించారు.

తాజాగా విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చోడ‌వ‌రంలో జ‌రిగిన‌ వైసీపీ మ‌హిళా గ‌ర్జ‌న స‌భ‌కు మాజ‌రైన సంద‌ర్భంగా రోజా మ‌రోమారు లోకేశ్ పై విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టిదాకా అంద‌రూ లోకేశ్ ను ప‌ప్పుగా అభివ‌ర్ణిస్తున్నార‌ని చెప్పిన రోజా... లోకేశ్ ప‌ప్పు కాద‌ని, ఎందుకూ ప‌నికి రాని గ‌న్నేరు ప‌ప్పు అని కొత్త త‌ర‌హా కామెంట్లు గుప్పించారు. తండ్రి గుడిని మింగితే కొడుకు గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారని లోకేశ్ తో పాటు చంద్ర‌బాబుపైనా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, గౌరవం ద‌క్కాలంటూ వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్య‌మ‌ని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడిన ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. వీధికో బార్‌, గ్రామల్లో విచ్చలవిడిగా వైన్‌ షాపులకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని దుయ్యబట్టారు. మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని, మహిళలను కించపరిచే టీడీపీ పాలనలో చంద్రబాబును అన్న అని కాకుండా సున్నా అని పిలవాలని రోజా సూచించారు. మహిళలకు మాంగల‍్యం దూరం చేసే మద్యం అమ్మకాలు నిలిపివేసే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మాత్రమే అన్నా అని పిలవగలమన్నారు. ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకొని వైఎస్‌ జగన్ నవరత్నాలను రూపొందించారని ఆమె వ్యాఖ్యానించారు. అమరావతిలో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ అని, ఇంతకాలం ఎన్టీఆర్‌ భవన్‌ కూడా అమరావతిలో ఏర్పాటు చేయని చంద్రబాబు ... ఎన్నికల తర్వాత ఏపీని వదిలి వెళ్లాల్సిందేనని జోస్యం చెప్పారు.