Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర ముగింపు..కొత్త పోరాటానికి రోజా రెడీ

By:  Tupaki Desk   |   2 Dec 2017 4:46 PM GMT
పాద‌యాత్ర ముగింపు..కొత్త పోరాటానికి రోజా రెడీ
X
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే - ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా పాద‌యాత్ర పూర్త‌యింది. గాలేరు న‌గ‌రి ప్రాజెక్టు కోసం 88 కిలోమీట‌ర్ల మేర చేసిన పాద‌యాత్ర ముగిసిన సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోజా ఈ రోజు తిరుప‌తికి చేరుకున్నారు. అయితే ఈ సంద‌ర్బంగా ఆమెకు ప్రొటోకాల్ స‌మ‌స్య ఎదుర‌యింది. తిరుమలలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు - అనుచరులతో కలసి శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా అనంత‌రం మీడియాతో మాట్లాడారు. రాయలసీమకు అన్యాయం చేసేలా తెలంగాణ ప్రాజెక్ట్‌ లు కడుతూ ఉంటే.... చంద్రబాబు ఓటుకు నోటు కేసు నుండి బ‌యటపడేందుకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ కాళ్ళుపట్టుకుంటున్నాడని మండిప‌డ్డారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు చుక్క నీరు రాలేదని రోజా ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా తిరుమల జేఈవోపై నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తిరుమలలో ఏడేళ్లుగా తిష్ట వేసి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సూటు కేస్ లు మోస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని జేఈఓ తీరుపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఉత్తరాది భక్తులపై ఉన్న ప్రేమ ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులపై లేదని ఆరోపించారు. ప్రోటోకాల్ పరిధిలోకి రాని వ్యక్తులకు 10 ఎల్ వన్ టికెట్స్ ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమ‌ర్శించారు. ఉత్తరాది కౌన్ కిస్కా భక్తులు వస్తే వాచ్ మెన్ లా దర్శనాలు చేయించే తిరుమల జేఈవో.. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వస్తే పట్టించుకోరా అని నిల‌దీశారు. ప్రస్తుతం ఈవో సింఘాల్ ను బుట్టలో వేసుకుని... తిరుమల జేఈవో ఆడింది ఆటగా, తన పాలన చేస్తున్నారని రోజా మండిప‌డ్డారు.

పూర్వపు ఈవో సాంబశివరావు తిరుమల జేఈవో అధికారాలు కట్ చేస్తే ఆయన వెళ్లిన తరవాత అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రోజా మండిప‌డ్డారు. తిరుమల టెంపుల్ డిప్యూటీ ఈవో, ప్రోటోకాల్ అధికారులు అధికారాల్ని గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారని మండిప‌డ్డారు. గ‌త ఆరు నెలలుగా టీటీడీ పాలక మండలి, స్పెసిఫైడ్ అథారిటీ లేదని దీంతో తిరుమలలో జేఈవో అక్రమాలకు అడ్డు లేదని రోజా మండిప‌డ్డారు. త‌నతో పాటు మున్సిపల్ ఛైర్మన్ - ఎంపీటీసీ - జెడ్‌ పీటీసీలు - సర్పంచ్ లు వస్తే వీఐపీ దర్శనం టికెట్స్ ఇవ్వ కుండా అవమానించారని రోజా మండిప‌డ్డారు. తిరుమల పవిత్రతను జేఈవో భ్ర‌ష్టు పట్టిస్తున్నారని ఆక్షేపించారు. సమాచార హక్కు చట్టం కింద టికెట్స్ కేటాయింపులు పై వివరణ తీసుకుని పోరాటం చేస్తాన‌ని రోజా ప్ర‌క‌టించారు.