Begin typing your search above and press return to search.

సరే పుచ్చుకోండి ఒక సారీ : రోజా

By:  Tupaki Desk   |   2 Sep 2016 5:03 AM GMT
సరే పుచ్చుకోండి ఒక సారీ : రోజా
X
నగరి ఎమ్మెల్యే రోజా ఒక వివాదానికి తెరదించారు. అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను, ఎమ్మెల్యే రోజా మీద ఏడాది పాటు సస్పెన్షన్‌ విధించిన వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇది చట్ట విరుద్ధమంటూ ఆమె ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే.. అసెంబ్లీ సభా హక్కుల కమిటీ చేపట్టిన విచారణకు కూడా హాజరవుతున్నారు. అయితే ఆమె క్షమాపణ చెబితే సరిపోతుందనే వరకు హక్కుల కమిటీ విచారణను ఒక కొలిక్కి తీసుకువచ్చింది. అందుకు రోజా మాత్రం తొలుత ససేమిరా అన్నారు. కానీ.. మరో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తిరిగి సభలోనే తన గళం వినిపించడానికి అవకాశం సజీవంగా ఉంచుకోవాలనుకున్నారో ఏమో గానీ.. రోజా బేషరతుగా క్షమాపణ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కాల్‌మనీ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రకు సంబంధించి.. గతంలో శాసనసభలో పెద్దస్థాయిలో వివాదం రేగినప్పుడు వైకాపా తరఫున తీవ్రస్థాయిలో గళం వినిపించిన రోజా మాటలు అప్పట్లో వివాదానికి దారి తీశాయి. స్పీకరు కోడెల ఆమెను ఏకం గా ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. నిబంధనల ప్రకారం అంత సుదీర్ఘకాలం సస్పెండ్‌ చేసే అధికారం స్పీకరుకే లేదంటూ రోజా కోర్టుకు వెళ్లారు. కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లింది తప్ప ఏ సంగతి ఇదమిత్థంగా తేలలేదు.

ఆలోగా కోర్టు సూచనల ప్రకారం.. విచారణ కమిటీ ముందు రోజా స్వయంగా హాజరయ్యారు కూడా.. జరిగిన దానికి ఆమె విచారం వ్యక్తం చేశారు తప్ప క్షమాపణ కోరలేదు. సస్పెన్షన్‌ తొలగించడం గురించి స్పీకరు కూడా పట్టించుకోలేదు. ఇక ఈ వ్యవహారం తేలడం లేదని రోజా అనుకున్నట్లుంది. అందుకే తాజాగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణ లేఖ రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెదేపా ఎమ్మెల్యే అనితపట్ల చేసిన వ్యాఖ్యలు ఆమెను బాధించి ఉంటే అందుకు కూడా క్షమాపణ చెబుతున్నట్లు రోజా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

రోజా క్షమాపణ లేఖను పరిగణనలోకి తీసుకుని, కోడెల శివప్రసాదరావు సస్పెన్షన్‌ను తొలగిస్తే గనుక, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా కు మరో గట్టి స్వరం జత కలుస్తుంది. అయితే స్పీకరు అసెంబ్లీ మొదలయ్యేలోగా నిర్ణయం తీసుకుంటారా లేదా, ఆ లేఖను విచారణ కమిటీకి పంపి సిఫారసు అడిగి కాస్త పొడిగిస్తారా అనేది వేచిచూడాలి.