Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు `రాఖీ పండుగ‌`: బాబు కాళ్లు మొక్కిన సీత‌క్క‌!

By:  Tupaki Desk   |   22 Aug 2021 3:30 PM GMT
చంద్ర‌బాబుకు `రాఖీ పండుగ‌`:  బాబు కాళ్లు మొక్కిన సీత‌క్క‌!
X
తెలంగాణ‌లో పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఎమ్మెల్యే సీతక్క‌.. టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు.. చంద్ర‌బాబు కాళ్ల‌కు మొక్కారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. అయితే.. ఇదేదో.. నిర‌స‌న‌లో బాగంగానో.. లేక‌.. మ‌రేమో.. కాదు.. అన్న‌య్య‌గా భావించి బాబుకు న‌మ‌స్కారం చేశాన‌ని.. సీతక్క సంతోషం వెలిబుచ్చారు. బాబు ఆశీర్వాదం ల‌భించ‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌ని కూడా ఆమె పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఆదివారం.. రాఖీ పౌర్ణ‌మి. ఈ నేపథ్యంలో దేశం యావ‌త్తు ఈ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకొంది.

అన్న‌-చెల్లెళ్లు, అక్కా-త‌మ్ముళ్లు త‌మ ప్రేమ‌ను చాటుకుంటూ.. రాఖీ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకొన్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడికి మహిళా నాయకులు రాఖీ క‌ట్టి. నోటిని తీపి చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్‌, ములుగు శాసన సభ్యురాలు సీతక్క, తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు, మాజీమంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత.. చంద్రబాబును కలిసి రాఖీ కట్టారు. రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నారు.

ఈ క్ర‌మంలో ఆదివారం సీతక్క, పరిటాల సునీత, పీతల సుజాత వేర్వేరు వాహనాల్లో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబును కలిసి రాఖీ కట్టారు. రాఖీ కట్టిన అనంతరం సీతక్క.. చంద్రబాబు కాళ్లు మొక్కారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన మనవడు, మాజీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌కూ వారంతా రాఖీ కట్టి, స్వీట్స్ తినిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సీతక్క తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

అంతకుముందు- సీతక్క.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. మల్కాజ్‌గిరిలోని నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా నేతలు నేరేళ్ల శారద, సునీతారావు తదితరులు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా రాఖీ పౌర్ణ‌మి.. రాజ‌కీయ నేత‌ల‌కు ఓ పండుగ వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.