Begin typing your search above and press return to search.

'టీ' అవసమానం; ఆటోలో వచ్చిన ఎమ్మెల్యేను ఐడీ అడిగారు

By:  Tupaki Desk   |   10 April 2015 6:00 AM GMT
టీ అవసమానం; ఆటోలో వచ్చిన ఎమ్మెల్యేను ఐడీ అడిగారు
X
నిరాడంబరంగా ఉంటూ.. నిలువెత్తు నిజాయితీకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటూ.. ఆదర్శ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారా? అంటూ చటుక్కున చూపించేందుకు ఉన్న అతికొద్ది ఎమ్మెల్యేల్లో భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఒకరు. మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా పని చేస్తున్న ఆయనకు తెలంగాణ సచివాలయంలో అవమానం జరిగింది.

మిగిలిన ఎమ్మెల్యేల మాదిరి ఖరీదైన కార్లలో ఆయన ప్రయాణించరు. సాదాసీదాగా ఆటోలో వెళ్లటం ఆయనకు అలవాటే. మిగిలిన వారి సంగతి తర్వాత.. సున్నం రాజయ్యను అందరూ గుర్తిస్తారు. అలాంటి ఆయన్ను తెలంగాణ సెక్రటేరియట్‌లోకి అనుమతించేందుకు చుక్కలు చూపించారు. ఆటోలో వచ్చిన ఆయన్ను సచివాలయ సిబ్బంది ఐడీ కార్డు అడిగారు.

తాను ఎమ్మెల్యే అంటే వినని వారు.. ఎమ్మెల్యే గుర్తింపు కార్డు చూపించాలన్నారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే ఐడీ కార్డు చూపించారు. ఆ తర్వాత కూడా ఆటోను మాత్రం లోపలికి అనుమతించే పని లేదంటూ వెనక్కి పంపారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన సున్నంరాజయ్య.. నిరసనగా సీ బ్లాక్‌ వరకు నడుచుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యేగా గుర్తించిన తర్వాత కూడా ఆయన ప్రయాణిస్తున్న ఆటోను అనుమతించకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో.. ఎమ్మెల్యేలంతా కార్లలోనే రావాలా? ఆటోలో వచ్చే ప్రజాప్రతినిధులకు మర్యాద ఇవ్వరా? లాంటి ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది ప్రదర్శించిన అతిని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటిదే ఉమ్మడి రాష్ట్రంలో జరిగితే.. టీఆర్‌ఎస్‌ నేతలు ఆగమాగం చేసే వారని.. జరిగిన ఘటనను ఆంధ్రా దురహంకారమని వ్యాఖ్యానించేవారని.. ఇప్పుడు అలాంటి వారి హయాంలోనే ఒక ఆదర్శ ఎమ్మెల్యేకు జరిగిన అవమానానికి ఏమని బదులిస్తారి ప్రశ్నిస్తున్నారు. మరి.. దీనికి తెలంగాణ అధికారపక్షం ఏం బదులిస్తుందో..?