Begin typing your search above and press return to search.

కొండాగుట్టలు దాటి సహాయం: ఆదర్శంగా నిలుస్తున్న పోలవరం ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   25 Jun 2020 8:50 AM GMT
కొండాగుట్టలు దాటి సహాయం: ఆదర్శంగా నిలుస్తున్న పోలవరం ఎమ్మెల్యే
X
అడవి బిడ్డల ఆకలి తీర్చేందుకు అవిశ్రాంతం గా లాక్ డౌన్ తో ఏర్పడిన పరిస్థితులకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కష్టాలు పడుతుంటే మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో వారు జీవించేందుకు కష్టాలు పడుతుంటారు. ఈ సమయం లో వారు జీవించడం కష్టంగా మారింది. ఈ కష్ట సమయంలో వారికి అండగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు నిలుస్తున్నారు. తెలంగాణలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మాదిరి ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.

అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో కొండలు, వాగులు, వంకలు దాటుతూ మారుమూల గిరిజన గ్రామాలకు చేరుకుంటున్నారు. గిరిజనులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 56 గిరిజన గ్రామాల్లో పర్యటించి సుమారు రూ.75 లక్షల విలువైన నిత్యావసరాలను ఎమ్మెల్యే బాలరాజు అందించారు. ఈ క్రమంలో బుధవారం బుట్టాయగూడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మోతుగూడెం గ్రామాన్ని సందర్శించారు. యాక్షన్‌ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిత్యావసర సరుకులు, కూరగాయలను ఎమ్మెల్యే 150 గిరిజన కుటుంబాలకు అందించారు.

కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సరైన రహదారి లేని ఈ గ్రామానికి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా మోతుగూడెం గ్రామంలో ఎమ్మెల్యే బాలరాజు గ్రామానికి చెందిన గోగుల కమలమ్మ అనే కొండరెడ్డి గిరిజన మహిళ ఇంట్లో గొడ్డు కారంతో భోజనం చేశారు. ఎమ్మెల్యే రాకతో ఆ గ్రామస్తులు ఆనందపడ్డారు. ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.