Begin typing your search above and press return to search.

ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై సొంత నేత‌లే క‌స్సు బుస్సు.. కిం క‌ర్త‌వ్యం!

By:  Tupaki Desk   |   16 April 2022 12:30 AM GMT
ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై సొంత నేత‌లే క‌స్సు బుస్సు.. కిం క‌ర్త‌వ్యం!
X
ఏపీ స‌ర్కారును ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయ‌ని, తాము రాజ‌న్న రాజ్యం అందిస్తుంటే.. ఓర్చుకోలేక పోతున్నా య‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ ఓడిపోతామో.. అనే భ‌యంతో త‌మ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయ‌ని.. ప‌దే ప‌దే చెప్పుకొచ్చే సీఎం జ‌గ‌న్‌కు,.. మంత్రుల‌కు ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల నుంచే భారీ సెగ త‌గిలింది. అది కూడా స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిని క‌ల్పించింది. ప్ర‌స్తుతం ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉన్న విష‌యం తెలిసిందే. క‌నీస ఖ‌ర్చుకల‌కూ.. అప్పులు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో ప‌నులు చేసిన వారికి బిల్లులు ఆపేశారు. అదేస‌మ‌యంలో వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను మాత్రం ఆపడం లేదు. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ కూడా కొన్నాళ్ల కింద‌ట స్ప‌ష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. న‌వ‌ర‌త్నాలు ఆపేది లేద‌న్నారు. స‌రే.. వీటిని అమ‌లు చేయ‌డానికి ఎవ‌రూ అడ్డంకులు సృష్టించ‌క‌పోయినా.. తాము చేసిన ప‌నుల‌కు బిల్లులు ఇవ్వాల‌నేదే కాంట్రాక్ట‌ర్ల డిమాండ్‌. దీనికి కూడా స‌ర్కారు ప‌ట్టించుకోకుండా ముందుకు సాగుతోంది. అంతేకాదు.. ఇదంతా విప‌క్షాల కుట్ర రాజ‌కీయం అంటూ.. జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

అయితే.. ఇప్పుడు ఇదే బిల్లుల విష‌యంపై.. వైసీపీ నాయ‌కుడు.. ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  త‌మ డ‌బ్బుల‌తో అభివృద్ధి ప‌నులు చేయిస్తే ఇప్పుడు వాటికి బిల్లులు రావ‌డం లేద‌ని ఆయ‌న కుండ‌ బ‌ద్ధ‌లు కొట్టారు. అభివృద్ధి ప‌నులు చేసి వాటి బిల్లులు రాక ఇబ్బందులు ప‌డుతున్న త‌మ నాయ‌కుల్ని చూస్తుంటే క‌న్నీళ్లు వ‌స్తున్నాయ‌ని ఎన్టీఆర్ జిల్లా మైల‌వరం ఎమ్మెల్యే వ‌సంత  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సుమారు రూ.200 కోట్ల ప‌నుల‌కు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

మైల‌వ‌రం పంచాయ‌తీ ఉప స‌ర్పంచ్ సీతారెడ్డి రూ.2.5 కోట్ల అభివృద్ధి ప‌నులు చేశార‌ని ఎమ్మెల్యే తెలిపారు. కానీ బిల్లులు ఆల‌స్యం కావ‌డంతో త‌న‌కున్న 5 ఎక‌రాల మామిడి తోట‌ను సీతారెడ్డి అమ్ముకోవాల్సి వ‌చ్చింద‌ని బాధ‌ప‌డ్డారు. ఈ విష‌యం త‌న దృష్టికి రావ‌డంతో ఆయ‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పిన‌ట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వ‌గ్రామంపై ప్రేమ‌తో బిల్లులు ఆల‌స్య‌మైనా సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేసి ప‌నులు పూర్తి చేశాన‌ని ఆయ‌న చెప్ప‌డంతో క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని కృష్ణ‌ప్ర‌సాద్ బాధ‌ప‌డ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో.. అభివృద్ధి ప‌నులు చేయించి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్ట‌ర్లు ఎలాంటి బాధ‌లు అనుభ‌విస్తున్నారో తాజాగా ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. ఏపీలో ప్ర‌భుత్వ ప‌నులు చేస్తే ఏళ్ల త‌ర‌బ‌డి బిల్లుల‌కు నోచుకోని ప‌రిస్థితి ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల త‌మ‌కు బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్ట‌ర్లు కోర్టు కు కూడా వెళ్లారు. దీంతో కొంత మేర‌కు ప్ర‌భుత్వం వారికి చెల్లించింది. అయితే.. దీనివెనుక విప‌క్షాలు ఉన్నాయ‌ని ఆరోపిస్తున్న ప్ర‌భుత్వం ఇప్పుడు సొంత ఎమ్మెల్యేకు ఏం స‌మాధానం చెబుతుందో చూడాలని అంటున్నారు ప‌రిశీల‌కులు.