Begin typing your search above and press return to search.

జగనాంధ్ర ప్రదేశ్... జగనన్న బీచ్...జగనన్న కొండ

By:  Tupaki Desk   |   22 Sept 2022 10:00 PM IST
జగనాంధ్ర ప్రదేశ్... జగనన్న బీచ్...జగనన్న కొండ
X
ఈ పేర్లు ఏమిటి అనుకుంటున్నారా. రాబోయే రోజుల్లో ఏపీలో పేర్ల మార్పు అన్న మాట. నిజానికీ ఈ పేర్ల మార్పు అన్నది పీక్స్ చేరితే వినిపించే కనిపించే పేర్లు ఇవేనని విపక్షాలు అంటున్నాయి. అధికార వైసీపీకి పేర్ల పిచ్చి పట్టుకుందని, ప్రతీ దాని మీద జగన్ పేరు ఉండాలన్న తపన కూడా ఎక్కువ అయిందని విమర్శిస్తున్నారు. దాంతో కాదేదీ అనర్హం అన్నట్లుగా అన్నింటికీ జగన్ పేరే పెట్టుకుంటున్నారు అని బీజేపీ నేతలు ఎకసెక్కమాడుతున్నారు.

వెటకారం పాలు కాస్తా ఎక్కువగా ఉన్న విశాఖ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే కాస్తా ముందుకెళ్ళి జగనాంధ్ర ప్రదేశ్ ని త్వరలో మనం చూడబోతున్నామని భారీ సెటైర్ పేల్చారు.

అలాగే జగన్న బీచ్ అని విశాఖ రామక్రిష్ణా బీచ్ కి పేరు మారినా ఆశ్చర్యం లేదని పంచ్ పేల్చారు. ఇక విశాఖలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ రుషికొండ పేరుని కూడా జగనన్న కొండగా మార్చే రోజు దగ్గరలో ఉందని చెప్పుకొచ్చారు.

ఇలా ప్రతీ పేరుని మార్చడమే ఈ ప్రభుత్వం చేసే పని అని ఆయన విమర్శలు గుప్పించారు. ఇలా ప్రభుత్వాలు పేరు మారినప్పుడు పేర్లు మార్చడం సరి అయిన విధానం కాదని ఆయన మండిపడ్డారు. దీని వల్ల ప్రజలకు ఒరిగేది ఏముందని ఆయన నిందించారు. 2024 ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ సర్కార్ మరోసారి అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని రాజు గారు తేల్చేశారు.

ఈ ప్రభుత్వం భారాన్ని ఎపుడు ఎన్నికలు వచ్చినా వదిలించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని ఆయన అంటున్నారు. గతంలో కూడా రాజు గారు ఇదే రకమైన జోస్యం చెప్పారు. ఇపుడు కూడా ఆయన మాట తప్పకుండా చెబుతున్న ఒకే ఒక మాట జగన్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని. చూడాలి మరి ఏం జరుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.