Begin typing your search above and press return to search.

జార్ఖండ్‌లో ఎమ్మెల్యేల‌ క్యాంపు రాజ‌కీయం.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   28 Aug 2022 3:30 AM GMT
జార్ఖండ్‌లో ఎమ్మెల్యేల‌ క్యాంపు రాజ‌కీయం.. రీజ‌న్ ఇదే!
X
జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఊగిసలాటలో ఉంది. సీఎం శాసనసభ్యత్వంపై అనర్హత వేటుకు గవర్నర్‌ నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థుల బేరసారాల నుంచి, ముఖ్యంగా బీజేపీ వ్యూహాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు.

సోరెన్‌ నివాసం నుంచి రెండు బస్సుల్లో ఎమ్మెల్యేలను కుంతీ జిల్లాకు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ లేదా బంగాల్‌కు ఎమ్మెల్యేలను పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 81 మంది సభ్యులున్న జార్ఖండ్‌ అసెంబ్లీలో సోరెన్‌ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది.

సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో జార్ఖండ్‌ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సోరెన్‌పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకా శాలున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.

సీఎంగా ఉంటూ గనుల లీజును సోరెన్‌.. తనకు తానే కేటాయించుకోవడం వివాదాస్పదమైంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష బీజేపీ.. రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై గవర్నర్‌ రమేశ్‌ బైస్‌.. ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని కోరారు. ఈసీ కూడా తన అభిప్రాయాన్ని సీల్డ్‌కవర్‌లో గవర్నర్‌కు పంపింది. దీనిపై గవర్నర్ తీసుకునే నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కొంది.