Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ చెక్: ‌ఎమ్మెల్యేల క‌న్నా వ‌లంటీర్ల ప‌వ‌రే ఎక్కువ‌

By:  Tupaki Desk   |   7 Jun 2020 1:30 AM GMT
జ‌గ‌న్ చెక్: ‌ఎమ్మెల్యేల క‌న్నా వ‌లంటీర్ల ప‌వ‌రే ఎక్కువ‌
X
నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేనే పెద్ద. వారికి తిరుగులేదు. ప‌వ‌రంతా వారికి ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఇష్ట‌మొచ్చిన తీరున ఎమ్మెల్యేలు ప్ర‌వ‌ర్తిస్తున్నారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డి నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాడు. ప‌రిపాల‌న‌లో విప్ల‌వాత్మ‌క వ్య‌వ‌స్థ‌ను వలంటీర్లను తీసుకొచ్చాడు. దీంతో సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ పై వ‌లంటీర్లే కీల‌క‌మ‌వుతున్నారు. మొత్తం వారి చేతుల మీదుగా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల‌కు చెక్ ప‌ట్టేందుకు సీఎం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ఏదైనా అంశం పై క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలకు చెబుతున్నవారు.. వారి పనితీరు పై క్షేత్రస్థాయిలో జనం మనోగతం ఎలా ఉందనే వ‌లంటీర్ల‌తో ప్ర‌‌భుత్వం ఆరా తీస్తోంది. ఈ విధంగా ఎమ్మెల్యేల క‌న్నా వ‌లంటీర్లే ప‌రిపాల‌న‌లో కీల‌కంగా మారాయి.

సమాంతర ప్రభుత్వంగా ప్ర‌స్తుతం వలంటీర్ల వ్యవస్థ మారింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి పై వలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఆరా తీసి ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలపై వలంటీర్లు నిఘా పెడుతున్నారు. దీంతో వలంటీర్లతో ఎమ్మెల్యేలు బెంబేలు చెందుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. తమ నియోజకవర్గాల్లోని వలంటీర్లు క్షేత్రస్థాయిలో ఏదైనా సమాచారం సేకరణకు వెళితే మాత్రం వారు హడలెత్తిపోతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో తప్పనిసరిగా సమావేశమయ్యేలా చూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను సమీక్షిస్తూనే.. పనిలో పనిగా తమపై, తమ అనుచరుల గురించి ఏమైనా విచారణ జరిపారా? అని మెల్లగా ఆరా తీస్తున్న ప‌రిస్థితి. రాజకీయం, అక్రమ రవాణా, అవినీతి వంటి సమాచారాన్ని క్షణాల్లో వ‌లంటీర్లు, స‌చివాల‌య సిబ్బంది చేరవేస్తుండ‌డంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒకింత ‌‌ఆందోళనలో ఉన్నారు. అధికారం వ‌చ్చినా ఎలాంటి ల‌బ్ధి పొందడం లేద‌ని క్షేత్ర‌స్థాయిలో పార్టీ శ్రేణుల‌కు ఉంది.

ఈ క్ర‌మంలోనే వలంటీర్ల‌తో అన్ని శాఖలు తమకు కావాల్సిన సమాచారాన్ని, సర్వేలను, ఇతర డేటాను వలంటీర్ల సేక‌రిస్తోంది. దీంతోపాటు ఆయా పోలీస్ స్టేషన్లలో ఉండే కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులు కూడా వలంటీర్ల ద్వారా గ్రామాలలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. పార్టీ అనుచరుల ఆగడాలు, దందాలు చేయ‌లేని ప‌రిస్థితి. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సూచించిన వారినే ఎంపిక చేశారు. వారిలో కొంద‌రు కార్యకర్తలతోపాటు సానుభూతిపరులు కూడా ఉన్నారు. వ‌లంటీర్లు రేషన్, పింఛ‌న్ పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వారే ఎమ్మెల్యేలు, పార్టీ నాయ‌కుల‌కు చేటుగా మారారు. ఈ వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌తో పోలీసులు కూడా అనుసంధాన‌మై శాంతిభ‌ద్ర‌త‌ల‌కు వినియోగించుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే మద్యం, ఇసుక అక్రమ రవాణా సమాచారం నిఘా వర్గాల క‌న్నా ముందే వలంటీర్లతో పోలీసులు సేకరిస్తున్నారు. దీంతో వెంట‌నే వాటిని అడ్డుకుంటున్నారు. ఇది అధికార పార్టీ నాయ‌కుల‌కు సంక‌టంగా మారింది. ఈక్ర‌మంలో ఇసుక రవాణా, పలు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఆయా గ్రామాల్లోని చోటా నేతల వ్యవహార శైలి, ఇతర ప్రజాప్రతినిధుల పనితీరుని సంబంధిత శాఖల జిల్లా అధికారులు వలంటీర్ల ద్వారా తెలుసుకుంటున్నారు. వారికి ద‌క్కకుండా ఇత‌రుల ద్వారా కార్య‌క్ర‌మాలు అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కాల్ సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు పరిశీలించి.. వెంటనే ఆయా గ్రామాలలోని వలంటీర్లకు ఫోన్ చేసి సమాచారం రాబడుతున్నారు. దీంతో వలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

వలంటీర్ల నియామకాల్లో పార్టీ ఎమ్మెల్యే.. నాయ‌కులే కీల‌కంగా ఉన్నారు. వారంతా త‌మ‌కు అండ‌గా నిల‌బ‌డ‌తార‌నుకుంటే ఇప్పుడు వారే చేటుగా మారారు. ఎమ్మెల్యేలే ఆటంకంగా మార‌డం వారికి త‌ల‌నొప్పిగా మారింది. ప్రభుత్వానికి సమాంతర సర్కారుగా వలంటీర్ల వ్యవస్థ పని చేస్తోందని వారు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. తమ స‌హ‌కారంతో వలంటీర్లుగా నియమితులైన వారే ఇప్పుడు తమకు విరోధంగా మారార‌ని కొందరు ఎమ్మెల్యేలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే ప‌రిస్థితి. గ్రామ పాలన వ్యవస్థలో వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది కీలకంగా మారారని.. వారే ఎమ్మెల్యేలుగా మారార‌ని మండి ప‌డ్డుతున్నారు. ఈ విధంగా వలంటీర్ల వ్య‌వ‌స్థ‌తో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయ‌కులను నాలుగు రాళ్లు వెన‌కేసుకోకుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది.