Begin typing your search above and press return to search.

జగన్ కోసమే కేసీఆర్ సర్వేలు

By:  Tupaki Desk   |   28 July 2017 5:19 PM GMT
జగన్ కోసమే కేసీఆర్ సర్వేలు
X
రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన వైసీపీకి 45% సీట్లు, టీడీపీకి 43 శాతం సీట్లు వ‌స్తాయ‌ని త‌న‌కు ఓ మిత్రుడు స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై ఏపీలో అధికార‌ప‌క్ష‌మైన‌ తెలుగుదేశం పార్టీ మండిప‌డింది. జగన్ కోసమే కేసీఆర్ సర్వేలు చేస్తున్నార‌ని ఆరోపించింది. వందల కోట్ల ఖర్చు చేసి వైఎస్ జగన్ నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెబుతుంటే కేసీఆర్ మాత్రం చిలక జోస్యాలు చెప్పుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీలో సర్వేలు వెల్లడించడం కాదని ఆయ‌న‌కు దమ్మంటే తెలంగాణలో చేయించుకున్న సర్వేలను బయటపెట్టాల‌ని కోరారు. ప్ర‌స్తుతం స‌ర్వే చేయించుకుంటే ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో తెలుస్తుందని ఆయ‌న ఎద్దేవా చేశారు.

దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, కేజీటుపీజీ, చనిపోయిన తెలంగాణ ఉద్యమ కారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, అధికారంలోకి వచ్చిన త‌ర్వాత‌ లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి వాగ్లానాలు ఇచ్చిన కేసీఆర్‌ మూడేళ్లయినా వాటిని నెరవేర్చలేకపోయార‌ని బుద్దా వెంక‌న్న ఆరోపించారు. తెలంగాణలో రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్య పాలన సాగటం లేదని ఒక కుటుంబ రాచరిక పాలన సాగుతుందని మేధావులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక తోక ముడుస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు నాయుడుపై ప్రతి సందర్భంలోను విరుచుకుపడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత అయిన వైఎస్ జగన్‌ను ఇంత వరకు ఒక్కసారి కూడా విమర్శించలేదని బుద్దా వెంక‌న్న అన్నారు. 2014 ఎన్నికల సంద‌ర్భంగా త‌న‌ సర్వేల ప్రకారం తెలుగుదేశానికి ఓట్లు రావని, కచ్చితంగా గెలిచేది జగన్ అని జోష్యం చెప్పి కేసీఆర్ భంగపడ్డారని ఆయ‌న గుర్తు చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేసీఆర్ తట్టుకోలేక కళ్లుకుట్టి జగన్ అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అదోగతి పాలు చేయవచ్చని కేసీఆర్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని బుద్దా వెంక‌న్న ఆరోపించారు. తెలంగాణలో అవినీతితో సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు కేసీఆర్, జగన్ అక్రమ సంబంధం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాలరాస్తున్నాడని బుద్ధావెంక‌న్న మండిప‌డ్డారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయ లబ్దికోసం కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలకు మద్దతు తెలియజేస్తూ ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. విభజన చట్టంలోని 9 - 10 షెడ్యుళ్లలోని ఉమ్మడి సంస్థలన్ని మావేనంటూ టీఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా వాదించినపుడు, ప్రతి చిన్న విషయానికి గవర్నర్‌ కు విజ్ఞాపన పత్రాన్ని అందించే జగన్ ఎందుకు కేసీఆర్‌ ను ప్రశ్నించలేదని సందేహం వ్య‌క్తం చేశారు. పోలవరం నిర్మాణంపై కపట ప్రేమ కనపరుస్తున్న జగన్ ఈ ప్రాజెక్టును కేసీఆర్ వ్యతిరేకించినప్పుడు కూడా జగన్ ప్రశ్నించలేదని బుద్దా వెంక‌న్న అన్నారు. 2015 మే లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ కు మద్దతు ఇచ్చి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని మండిప‌డ్డారు. ఈ సంఘటనలు జగన్- కేసీఆర్ మ‌ధ్య‌ ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తున్నాయ‌ని ఆరోపించారు.