Begin typing your search above and press return to search.

మహాత్మాగాంధీ ఎన్నికల ఖర్చు 10 కోట్లు

By:  Tupaki Desk   |   5 July 2018 4:59 AM GMT
మహాత్మాగాంధీ ఎన్నికల ఖర్చు 10 కోట్లు
X
ఎన్నికలంటే ధన ప్రవాహమే. డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే కాకలు తీరిన నేతలకైనా డిపాజిట్లు రావడం కూడా కష్టమే. పరిస్థితులు అంతలా మారిపోయాయి. కోట్లు ఖర్చు చేస్తే కానీ ఎన్నికల్లో పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో సాక్షాత్తు మహాత్మాగాంధీ వచ్చినా డబ్బులు ఖర్చు చేయాల్సిందేనని కర్ణాటకకు చెందిన ఓ నేత వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

కర్ణాటక ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు ఎంతో ఖరీదైపోయాయన్న ఆయన స్వయంగా మహాత్మాగాంధీ ఎన్నికల బరిలోకి దిగినా నోట్ల కట్టలు పట్టుకోవాల్సిందేనని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకు మరింత ఖరీదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. గాంధీ పోటీచేసినా అంత మొత్తం ఖర్చు చేయక తప్పదన్నారు.

ప్రజల కోసం ప్రభుత్వ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా వారికి పట్టడం లేదని - పోలింగ్ రోజు నాయకులు పంచే తాయిలాల గురించే వారు ఆలోచిస్తున్నారంటూ ఇబ్రహీం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే... ఇబ్రహీం వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని.. వాస్తవ పరిస్థితులకు ఆయన మాటలు అద్దంపడుతున్నాయని దీనిపై పలువురు అభిప్రాయపడుతున్నారు. నీతిమంతులు - నిజాయితీపరులు - ప్రజల కోసం పనిచేసేవారు కూడా ఎన్నికల్లో ఓడిపోతూ అక్రమార్కులు తిరుగులేని విజయాలు సాధిస్తుండడమే దీనికి ఉదాహరణ అంటున్నారు.