Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని గుర్తు చేస్తున్న ఎమ్మెల్సీ కౌంటింగ్

By:  Tupaki Desk   |   19 March 2021 6:30 AM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని గుర్తు చేస్తున్న ఎమ్మెల్సీ కౌంటింగ్
X
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా సాగిపోతోంది. బుధవారం ఉదయం ఆరు గంటలకు మొదలైన ఎన్నికల కౌంటింగ్.. శుక్రవారం ఉదయానికి సాగిపోతూనే ఉంది. అధికారుల లెక్కల ప్రకారం శనివారానికి కానీ.. శనివారం అర్థరాత్రికి కాని ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. నల్గొండ (నల్గొండ.. ఖమ్మం.. వరంగల్).. హైదరాబాద్ (హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్) పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇంత సుదీర్ఘంగా సాగటానికి కారణం.. ఆ ఎన్నికలో ఉన్న సంక్లిష్టతే కారణమన్నది తెలిసిందే.

అయితే.. ఈ రెండు స్థానాల ఓట్ల లెక్కింపును చూస్తే నల్గొండతో పోలిస్తే.. హైదరాబాద్ కౌంటింగ్ చాలా ఆలస్యమవుతోంది. నల్గొండ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావటమే కాదు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైంది. అన్ని అనుకున్నట్లు జరిగితే..శనివారానికి ఈ ఫలితం ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్ స్థానం ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే.. శుక్రవారం ఉదయానికి నాలుగు రౌండ్లు మాత్రమే పూర్తి అయ్యాయి.

మొదటి ప్రాధామ్య ఓట్ల లెక్కింపు పూర్తి కావటానికి మరో 20 గంటలు పడుతుందన్న మాట వినిపిస్తోంది. అది పూర్తి అయిన వెంటనే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉంటుందని చెబుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వచ్చిన ఫలితాలు పోటాపోటీగా ఉండటం.. ఎన్నికల నిబంధన అయిన 50 శాతం ప్లస్ ఒక ఓటు వచ్చే అవకాశం ఎవరికి లేనందున.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమని చెప్పక తప్పదు.

దీంతో.. ఈ ఎన్నిక ఫలితం శనివారం రాత్రి కానీ.. అర్థరాత్రి దాటిన తర్వాత కానీ తేలే అవకాశం ఉందంటున్నారు. మరింత ఆలస్యమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. ఇదంతా చూస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావటానికి వారాల తరబడి సమయం తీసుకోవటం తెలిసిందే. తాజా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వ్యవహారం కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్నిగుర్తు చేస్తుందని చెప్పక తప్పదు.