Begin typing your search above and press return to search.

నాగం కాలుపెట్టకముందే కత్తి దూస్తున్నారు!

By:  Tupaki Desk   |   22 Feb 2018 10:09 AM GMT
నాగం కాలుపెట్టకముందే కత్తి దూస్తున్నారు!
X
ఆయన ఇంకా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనే లాంఛనం పూర్తి కాలేదు.. అధికారిక ప్రకటన కూడా రాలేదు. కానీ అప్పుడే ఆయన మీద స్థానిక కాంగ్రెస్ నాయకులు కత్తిదూయడం మాత్రం ప్రారంభం అయిపోయింది. నాగం జనార్దన రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే గనుక.. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరుతాం అని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి చెబుతున్నారు. ఈమేరకు రాహుల్ కు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు అంటున్నారు. జిల్లాకే చెందిన డికె అరుణ మరికొందరు నాయకులతో కలిసి.. అసలు ఆయనను పార్టీలోకి రానివ్వవద్దని రాహుల్ కు విన్నవించాం అంటున్నారు.

నాగం అడుగుపెడితే కాంగ్రెస్ లో ప్రత్యేకించి పాత మహబూబ్ నగర్ జిల్లాలో ముఠా కుమ్ములాటలు పెరిగిపోతాయనేది దామోదర్ రెడ్డి వాదన. ఇలాంటి ముఠా కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాకపోయినప్పటికీ.. నాగం ద్వారా కొత్త ముఠాలను తెచ్చుకోవడం అనవసరం అనేది వారి వాదన. పైగా నాగం తనకంటూ కేడర్ లేని లీడర్ అనే విమర్శలు కూడా వస్తున్నాయి. సీనియర్ నేత జైపాల్ రెడ్డితో ఒక రహస్య ఒప్పందం మేరకే నాగం జనార్దనరెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

నాగం రెండు రోజులకిందటే ఢిల్లీలో రాహుల్ తో భేటీ అయ్యారని - ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే చేరిక ముహూర్తం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో స్థానిక నేతల వ్యతిరేకత ఈ స్థాయిలో పెల్లుబికడం గమనార్హం.

ఒక రకంగా చూసినట్లయితే దామోదర్ రెడ్డి వాదనలో కూడా నిజం ఉన్నదనే అనిపిస్తోంది. నాగం జనార్దనరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, వారి ప్రభుత్వం ఉన్నప్పుడు... జిల్లాలోని కాంగ్రెస్ వారి మీద అక్రమ కేసులు బనాయించి అనేక రకాలుగా హంసించారని ఆయన అంటున్నారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెసులో చేర్చుకుని ఆయన విజయం కోసం తమను పనిచేయమంటే అది సాధ్యం కాదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆయనను ఓడించడానికే తాము ఎప్పటికీ ప్రయత్నిస్తాం అని చెబుతున్నారు.

ఇన్ని వ్యతిరేకతల మధ్య నాగం జనార్దనరెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని సాధించేది ఏముంటుంది? అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఆయనకు మరో గత్యంతరం కూడా లేదని.. అసలే ఆయన ఉనికిని పట్టించుకోకుండా వదిలేసిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరకుండా ఆగిపోయినంత మాత్రాన విలువ ఇవ్వదని, ఇంకా చులకనగా చూస్తుందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.