Begin typing your search above and press return to search.

కోడ్ అమ‌ల్లోకి.. అడుగులు వెన‌క్కి

By:  Tupaki Desk   |   14 Nov 2021 9:51 AM GMT
కోడ్ అమ‌ల్లోకి.. అడుగులు వెన‌క్కి
X
తెలంగాణ‌లో రాజ‌కీయ ముఖచిత్రం క్ర‌మంగా మారుతోంది. ఇన్నాళ్లూ త‌న‌కు తిరుగులేద‌నుకున్న అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఇప్పుడు స‌వాలు విసిరే స్థాయికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఎదిగాయి. కాంగ్రెస్‌, బీజేపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. కేసీఆర్‌పై అన్ని వైపుల నుంచి దాడి చేస్తూనే ఉన్నాయి. స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీలు, పాద‌యాత్ర‌ల పేరుతో ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నాయి. ఇక ఈ పోరాటాన్ని మ‌రింత ఉద్ధృతం చేసేందుకు ప్రత్యర్థి పార్టీలు స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. కానీ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో ఇప్పుడా పార్టీ కార్య‌కలాపాల‌కు బ్రేక్ ప‌డ్డ‌ట్ల‌యింది.

రాజ‌న్న రాజ్య‌మే ల‌క్ష్యంగా ఈ ఏడాది జులై 8న త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన ష‌ర్మిల.. కేసీఆర్ను ల‌క్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్ర‌ధానంగా నిరుద్యోగ స‌మ‌స్య‌ను భుజాల‌కెత్తుకున్న ఆమె పోరుబాట‌లో క‌దులుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నించేందుకు అక్టోబ‌ర్ 20న ఆమె ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సుమారు ఏడాదికిపైగా దాదాపు 4 వేల కిలోమీట‌ర్లు చుట్టేసేలా ఈ పాద‌యాత్ర‌కు ప్లాన్ చేశారు. కానీ ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌కారం రాష్ట్రంలో కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో పాద‌యాత్ర‌కు తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించారు.

ఇక గతేడాది బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎంపికైన బండి సంజ‌య్ త‌న దూకుడుతో పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతంపై దృష్టి సారించ‌డంతో పాటు కేసీఆర్‌పై మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు షాకిచ్చిన బీజేపీ.. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లోనూ విజ‌యం అందుకుంది. మ‌రోవైపు రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 28న మొద‌లైన ఆయ‌న తొలి విడ‌త పాద‌యాత్ర 36 రోజుల పాటు 438 కిలోమీట‌ర్లు సాగి అక్టోబ‌ర్ 2న ముగిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విజ‌యమిచ్చిన ఊపుతో రెండో విడ‌త పాద‌యాత్ర‌ను ఆయ‌న న‌వంబ‌ర్ 21 నుంచి మొద‌లెట్టాల‌నుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా దాన్ని వాయిదా వేశారు.

మ‌రోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికలో దారుణ‌మైన ఫ‌లితాల‌తో ఢీలా ప‌డ్డ కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పాద‌యాత్ర‌ను వాయిదా వేసుకోవ‌డ‌మే మేల‌ని భావించిన‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ 14 నుంచి 21వ తేదీ వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ జ‌న జాగ‌ర‌ణ ప్ర‌జాచైత‌న్య యాత్ర‌లు, పాద‌యాత్ర‌లు నిర్వ‌హించాలనుకుంది. కానీ ప్ర‌స్తుతం పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త విభేదాలతో పాటు ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా ఈ యాత్ర‌ల‌ను పార్టీ వాయిదా వేసుకున్న‌ట్లు స‌మాచారం.