Begin typing your search above and press return to search.

50 మంది మాత్రమే ఓట్లు వేయలేదు

By:  Tupaki Desk   |   28 Dec 2015 4:06 AM GMT
50 మంది మాత్రమే ఓట్లు వేయలేదు
X
ఆరు స్థానిక ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయ్యింది. మొత్తం నాలుగు జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కేవలం 50 ఓట్లు మినహా మిగిలిన ఓట్లు మొత్తం పోలయ్యాయి. ఎన్నికలు జరిగిన నాలుగు జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన పోలింగ్ లో అత్యధికంగా 99.7శాతం ఓట్లు వేయగా.. అతి తక్కువగా ఖమ్మం జిల్లాలో జరిగింది. ఇక్కడ 95.3 శాతం మంది ఓట్లు వేశారు. స్థానిక కోటాకు జరుగుతున్న పోలింగ్ కావటం.. ప్రతి ఓటు కీలకంగా మారిన పరిస్థితి.

దీంతో.. ఏ ఓటు మిస్ కాకుండా ఉండేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. నాలుగు జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఓట్లకు.. పోలైన ఓట్లకు మధ్య అంతరం చూస్తే.. ఈ పోలింగ్ ను రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయో ఇట్టే అర్థమవుతుంది.

రంగారెడ్డి జిల్లాలో మొత్తం 771 ఓట్లు ఉంటే.. 769 ఓట్లు పోలయ్యాయి. అంటే.. రెండు ఓట్లు మాత్రమే మిస్ అయ్యాయన్నమాట. ఇక.. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1260 ఓట్లకు 1256 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక.. నల్గండ జిల్లాలో ఉన్న మొత్తం 1110 ఓట్లకు 1100 ఓట్లు పోలయ్యాయి. అంటే.. ఈ జిల్లాలో పది ఓట్లు మాత్రమే మిస్ అయ్యాయి. మిగిలిన మూడు జిల్లాలతో పోలిస్తే.. ఖమ్మం జిల్లాలో ఒకింత తక్కువ ఓట్లు పోల్ కావటం గమనార్హం. ఖమ్మం జిల్లాలో మొత్తం 726 ఓట్లు ఉంటే.. 692 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ జిల్లాలో మొత్తం 34 ఓట్లు మిస్ అయ్యాయి. తక్కువ ఓట్లున్న ఖమ్మం జిల్లాలోనే.. తక్కువ ఓట్లు పోల్ కావటం గమనార్హం.

మొత్తం తొమ్మిది జిల్లాల్లో 12 మంది ఎమ్మెల్సీలను స్థానిక సంస్థల ప్రతినిధులతో ఎన్నుకోవాల్సి ఉంటే.. వీటిల్లో 6 స్థానాల్ని ఇప్పటికే తెలంగాణ అధికారపక్షం తన ఖాతాలో వేసుకొంది. మిగిలిన ఆరు స్థానాలకు ఎన్నికలు ఆదివారం జరిగాయి. అయితే.. ఖమ్మం.. మహబూబ్ నగర్జిల్లాలకు చెందిన సీపీఎం.. న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన 11 మందిని ఆ పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చెదురుమొదురు ఘటనలు మినహా ఎన్నికలు మొత్తం ప్రశాంతంగా జరిగాయనే చెప్పాలి. ఈ పోలింగ్ వివరాలు డిసెంబరు 30న వెల్లడి కానున్నాయి.