Begin typing your search above and press return to search.

హ‌రీష్ రావును టార్గెట్ చేశారా..? అందుకే ఎమ్మెల్సీ బాధ్యతలా??

By:  Tupaki Desk   |   3 March 2021 2:30 AM GMT
హ‌రీష్ రావును టార్గెట్ చేశారా..? అందుకే ఎమ్మెల్సీ బాధ్యతలా??
X
ప్రస్తుతం తెలంగాణలో రెండు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఒక‌టి వ‌రంగల్‌-న‌ల్గొండ‌-ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం కాగా.. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ రెండోది. ఈ రెండిట్లోనూ అధికార పార్టీ అభ్య‌ర్థుల‌ను నిలిపింది. అయితే.. ఈ రెండు నియోజక‌వ‌ర్గాల్లోనూ టీఆర్ఎస్ కు గెలుపు అవ‌కాశం గ‌నక‌ ఉంటే అది వ‌రంగ‌ల్‌-న‌ల్గొండ‌-ఖ‌మ్మం మాత్ర‌మేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ లో ఛాన్సే లేదంటున్నారు. దీనికి గ‌త రికార్డును కూడా సాక్ష్యంగా చూపుతున్నారు. అయితే.. ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతను హ‌రీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. దీంతో.. హరీశ్ ను మళ్లీ టార్గెట్ చేశారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు ప‌రిశీల‌కులు.

ఇప్ప‌టి వ‌ర‌కు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి 2007, 2009, 2015లో ఎన్నిక జ‌రిగింది. ఇందులో రెండుసార్లు టీఆర్ ఎస్ ఓడిపోయింది. 2009లో మాత్రం పోటీకి దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు నాలుగోసారి ఎన్నిక జ‌రుగుతోంది. 2007లో పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాల‌వ్వ‌గా.. 2009లో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతునిచ్చింది. ఆయన విజ‌యం సాధించారు. 2015లో టీఎన్జీవోస్‌ యూనియన్‌ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి టీఆర్‌ఎస్‌ తరపున బరిలోకి నిలిపినా విజ‌యం దక్కలేదు.

అటు, దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యతను కూడా హరీష్ రావుకు అప్పగించడం గమనించాల్సిన విషయం. అక్కడ టీఆర్ఎస్ ఓడిపోతుంద‌నే ప్ర‌చారం ఎన్నిక‌ల ముందునుంచీ సాగింది. ఫ‌లితం కూడా అలాగే వ‌చ్చింది. ఇప్పుడు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ పరిస్థితి అలాగే ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. గ‌త రికార్డు కూడా అలాగే ఉంది. ఇక్క‌డ కూడా హ‌రీష్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి.. ప్ర‌స్తుత‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పక్షంలో ఎన్న‌డూ లేనంత‌ ఆందోళన కనిపిస్తోంది. పీఆర్సీ రాక ఉద్యోగులు, నియామకాల పట్ల నిరుద్యోగ యువత ప్రభుత్వం పట్ల అసంతృప్తి తో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఓడితే పార్టీ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ కార‌ణాల వ‌ల్లే హ‌రీష్ రావును పిలిచి, బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని అంటున్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈ విష‌యాన్ని పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. గెలిచే స్థానాల్లో కేటీఆర్ కు, ఓడిపోయే చోట హ‌రీష్ కు బాధ్య‌త‌లు ఇస్తున్నార‌ని, ఈ ఎన్నిక‌ల త‌ర్వాత హ‌రీష్ క‌నిపించ‌క‌పోవ‌చ్చ‌ని అన్నారు.

నిజానికి.. హరీష్ టీఆర్ఎస్‌లో ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారన్నది నిజం. గ‌తంలో మాదిరి అటు పార్టీలో కూడా ప్రాధాన్యం లేకుండాపోయింద‌ని సొంత పార్టీ నేత‌లే చెబుతున్నారు. బ‌య‌టికి కూడా అలాగే క‌నిపిస్తోంది. అటు దుబ్బాక‌లో ఓట‌మికి హ‌రీష్ ను బాధ్యున్ని చేసే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని, ఇటు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ అదే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి, ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది చూడాలి.