Begin typing your search above and press return to search.

డ్రైవర్ హత్య కేసులో కీలక మలుపు.. ఎమ్మెల్సీ నిజం ఒప్పుకున్నాడా?

By:  Tupaki Desk   |   23 May 2022 11:21 AM GMT
డ్రైవర్ హత్య కేసులో కీలక మలుపు.. ఎమ్మెల్సీ నిజం ఒప్పుకున్నాడా?
X
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాజీ డ్రైవర్ మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీ కారులోనే డ్రైవర్ మృతదేహం కనిపించడం.. అది వారి ఇంటికి తీసుకొచ్చి ఎమ్మెల్సీనే దించడంతో ఇది పెద్ద దుమారం రేపింది. తన కారు డ్రైవర్ కు యాక్సిడెంట్ జరిగిందని ఎమ్మెల్సీ తెలపడం.. కాదు హత్య అని వారి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ వివాదం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో దీనిపై పోలీసులు, ప్రభుత్వం అలెర్ట్ అయ్యారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన పోలీసులు ఈ కేసును ఛేదించినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే ఉదయ్ భాస్కర్ ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టుగా.. ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చని మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో వైసీపీ ఎమ్మెల్సీ నిజం ఒప్పుకున్నట్టుగా ప్రధాన మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తానే హత్య చేశానని.. ఇందులో ఎవరి ప్రమేయం లేదని.. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేశానని వైసీపీ ఎమ్మెల్సీ పోలీసుల విచారణలో అంగీకరించినట్టుగా ఆఫ్ ది రికార్డుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన వ్యక్తిగత విషయాలు అందరికీ చెబుతానని బ్లాక్ మెయిల్ చేశాడని.. కొట్టి బెదిరిద్దామనుకున్నానని.. కానీ ఆ క్రమంలో ఇలా జరిగిందని పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ నిజం ఒప్పుకున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే అధికారికంగా మాత్రం ఇప్పటివరకూ ఇటు పోలీసులు కానీ.. అటు ఎమ్మెల్సీ కానీ డ్రైవర్ హత్య విషయంపై ఎలాంటి సమాచారం మీడియాకు వెల్లడించలేదు. కేవలం విచారణపై ఊహాగానాలు మాత్రమే మీడియాలో వచ్చాయి. నిజంగా ఎమ్మెల్సీనే హత్య చేశాడా? లేక ప్రమాదమా? అన్నది పోలీసులు అధికారికంగా వివరించాల్సి ఉంది.

ఇక విచారణ అనంతరం పోలీసులు డ్రైవర్ ను ఇంటికొచ్చి తీసుకొచ్చినప్పటి నుంచి అతడి మృతదేహం కారులో దొరికే వరకూ సీన్ రీకన్ స్ట్రక్షన్ పోలీసులు చేసినట్టు సమాచారం. దీనిపైమీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అసలు నిజనిజాలేమిటీ? అన్నవి పోలీసులు వెల్లడించాల్సి ఉంది.