Begin typing your search above and press return to search.

చింతమడక సీఎం పాతబడింది.. కొత్తగా ట్రై చేయొచ్చుగా?

By:  Tupaki Desk   |   7 Aug 2019 10:10 AM IST
చింతమడక సీఎం పాతబడింది.. కొత్తగా ట్రై చేయొచ్చుగా?
X
వయసు మీద పడొచ్చు. కానీ.. మాట పవరు.. పంచ్ తగ్గకూడదు. కానీ.. తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు తీరు చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. ఫైర్ బ్రాండ్ నేతల మాటలన్ని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుల మాదిరి.. పాత చింతకాయ పచ్చడిలా మారుతున్నాయి. చెప్పిన మాటల్నే చెబుతూ.. విసుగు తెప్పిస్తున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేసేటప్పుడు అంతో ఇంతో కసరత్తు చేయాలి. విషయాల్ని అప్డేట్ చేసుకోవాలి.

కానీ.. ఇదేమీ చేయని కాంగ్రెస్ నేతల మాటల్లో పస తగ్గటంతో.. వారి నోటి నుంచి వచ్చే మాటల్ని నసగా మారుతున్నాయి. చింతమడకకు వరాల జల్లు కురిపించిన కేసీఆర్ తీరుపై తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాను పుట్టి.. పెరిగిన ఊరు మీద అభిమానాన్ని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రకటించటం తప్పుగా చెప్పలేం. కానీ.. మోతాదు మించిన హామీలు..వరాలు మంచివి కావు. ఓ పక్క కనీస మౌలిక సదుపాయాల కోసం కిందామీదా పడుతుంటే.. మరోవైపు అందుకు భిన్నంగా తాను పుట్టిన ఊరిలో పుట్టినోళ్లంతా లక్కీ ఫెలోస్ అన్న రీతిలో కేసీఆర్ వరాలు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేరు.

ఈ విషయాన్ని మనసుల్ని హత్తుకునేలా చెప్పాల్సిన కాంగ్రెస్ నేతలు అందుకు భిన్నంగా రొడ్డుకొట్టుడు డైలాగ్స్ చెబుతున్న తీరు సరికాదని చెప్పక తప్పదు. ఈ మధ్యన చింతమడక ప్రజలకు ఇచ్చిన వరాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్ నేతల్లో మిస్ అవుతున్నదేమిటో ఇట్టే అర్థం కాక మానదు. చింతమడక ప్రజలు ఓట్లు వేస్తేనే తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యవా అంటూ కేసీఆర్ ను నిలదీయటంలో అర్థం లేదన్న విషయాన్ని జీవన్ రెడ్డి లాంటోళ్లు ఎప్పటికి గుర్తిస్తారో?