Begin typing your search above and press return to search.

బాబు కాలకేయుడయ్యాడు!

By:  Tupaki Desk   |   8 Nov 2016 2:59 AM GMT
బాబు కాలకేయుడయ్యాడు!
X
తమ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యాత్రలు చేస్తున్న నాయకుడ్ని టార్గెట్ చేసే క్రమంలో తెలంగాణ అధికారపక్షం నేతల తీరు కాస్త వెరైటీగా ఉంది. తమ తీరును తప్పు పడుతున్న నాయకుడ్ని వదిలేసి.. ఆయన బాస్ పై చెలరేగిపోతున్న వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తెలంగాణ రాజకీయాలకు చాలావరకూ దూరంగా ఉంటున్న ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ చంద్రబాబును టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ భిన్నమైన రీతిలో విమర్శలు చేయటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర సర్కారు హయాంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెర మీదకు తీసుకొస్తూ రైతు యాత్రలు చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షనేత రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఈ క్రమంలో రేవంత్ కంటే కూడా చంద్రబాబుపై కర్నె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సమస్యల్ని వదిలేసి.. ఏపీ సమస్యల్ని ప్రస్తావించారు. ఏపీ ముఖ్యమంత్రిని బాహుబలి సినిమాలో కాలకేయుడు పాత్రతో పోల్చిన కర్నె.. తమ నాయకుడి నేతృత్వంలో తెలంగాణ సర్కారుకు రైతులకు మూడు పంటలు పండించేందుకు వీలుగా నీరు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం మూడు పంటలు పండించే పంటల్ని రైతుల నుంచి లాక్కొంటోందని ఆరోపించారు.

రాజధాని పేరుతో ఏపీ ముఖ్యమంత్రి రైతుల నుంచి బలవంతంగా భూముల్ని లాక్కున్నారని కర్నె విమర్శించారు. 30 వేల ఎకరాలు లాక్కొని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల భూముల్ని లాక్కున్న బాబును తాము అందుకే బాహుబలి చిత్రంలోని కాలకేయుడి పాత్రతో పోలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి తీరు ఇలా ఉంటే.. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. కానీ.. టీటీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నట్లుగా ఫైర్ అయ్యారు.

ఏపీ ముఖ్యమంత్రిగా బాబు హయాంలో రాష్ట్రంలో నాడు 15వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పిన కర్నె.. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవటానికి తెలుగుదేశం పార్టీనే అంటూ ఆరోపించారు. కరెంటు ఛార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపిన ఘనత చంద్రబాబుదేనని ఎప్పుడో జరిగిపోయిన విషయాల్నిసరికొత్తగా తెర మీదకు తీసుకొచ్చారు కర్నె ప్రభాకర్. అలాంటి నేపథ్యం ఉన్న తెలుగుదేశం నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళుతున్నారంటూ దుయ్యబట్టారు.

విభజన తర్వాత గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో ఏ తెలంగాణ అధికారపక్ష నేత కూడా ఏపీ ప్రభుత్వం.. ఏపీ సర్కారు నిర్ణయాలపై ఈ స్థాయిలో చెలరేగిపోలేదు. అందుకు భిన్నంగా కర్నె వ్యాఖ్యలు ఉండటం విశేషంగా చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్రం.. తెలంగాణ ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడే టీఆర్ఎస్ నేతలకు భిన్నంగా కర్నె మాత్రం ఏపీ రైతులు.. రాజధాని లాంటి అంశాలు ప్రస్తావించటం దేనికి సంకేతమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.