Begin typing your search above and press return to search.

తెలుగుదేశం కాదు...అబద్దాల దేశం

By:  Tupaki Desk   |   4 Sep 2018 4:03 PM GMT
తెలుగుదేశం కాదు...అబద్దాల దేశం
X
తెలుగుదేశం పార్టీపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మరోసారి విరుచుకుపడింది. తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు. ఇన్నాళ్లూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడ్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీంతో వీరి విమర్శలు - ఆరోపణల దాడి నుంచి ఎలా బయటపడాలో తెలుగుదేశం నాయకులకు అర్ధం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన బిజెపి నాయకులు వీలున్నప్పడల్లా విరుచుకుపడాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే రాష్ట్ర బిజెపీ నాయకులు వ్యవహరించడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ తన పేరును మార్చుకోవాలని, ఇక నుంచి ఈ పార్టీని అందరూ అబద్దాల పార్టీగా పిలవాలని ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు మండి పడ్డారు. పెట్రోలు ధరలు పెరుగుదలపై ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు అవాస్తవాలని - ఆయన చీటికీ మాటికీ అబద్దాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని అభాసుపాలు చేసేందుకే ము‌ఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు ఇలా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఇక అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారిపై విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్రంలో గడచిన నాలుగేళ్లలో చేసిన అవినీతి సొమ్మును అమరావతి బాండ్ల రూపంలోకి మారుస్తున్నారని ఆయన ఆరోపించారు.

మరోవైపు శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్ష నేత విష్ణుకుమార రాజు కూడా తెలుగుదేశంపై మండిపడుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌ లో గుండాలు రాజ్యం ఏలుతున్నారని, ఇది గుండాల రాజ్యంగా మారిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నమంత్రుల కారణంగా ప్రతి రోజూ తెలుగుదేశం గ్రాఫ్ పడిపోతోందని - రానున్న రోజుల్లో ఇది మరింత పడి పోతుందని ఆయన అన్నారు. గుండాలకు నిలయంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌ లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని - ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి అంటూ ఏదైనా ఉంటే అది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో ఇచ్చిన నిధులతో జరిగిందేనని ఆయన అన్నారు. పెట్రోలు ధరలు వంద రూపాయలు చేసేస్తారేమో అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలుపై ఏ రాష్ట్రంలోనూ లేని పన్నుల భారం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని, దీనికి కారణం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అవలంభిస్తున్న విధానాలేనని రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విమర్శించారు. నిజానికి పెట్రలును జీఎస్టీ పరిధిలోకి రాకుండా అడ్డుకున్నది ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామక్రష్ణుడే అని ఆయన అన్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడిపై దాడులు చేస్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు తమపై విమర్శలు చేస్తే వాటికి కూడా వెంటనే కౌంటర్ ఇవ్వాలన్న అధిష్టానం నిర్ణయాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు.