Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ లో చేసిన తప్పే అమరావతిలో చేస్తున్నారు

By:  Tupaki Desk   |   10 Sep 2018 5:01 PM GMT
హైదరాబాద్‌ లో చేసిన తప్పే అమరావతిలో చేస్తున్నారు
X
న‌వ్యాంధ్ర‌ను నంద‌న‌వ‌నంలా తీర్చిదిద్దుతాన‌ని.....అమ‌రావ‌తిని ప్రపంచ‌స్థాయి రాజ‌ధాని చేస్తాన‌ని.....గ‌త నాలుగేళ్లుగా చంద్ర‌బాబు అరిగిపోయిన రికార్డును తిర‌గేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అర‌చేతిలో భ్ర‌మ‌రావ‌తిని చూపిస్తోన్న బాబుగారు....ప్ర‌పంచ‌దేశాల‌కు మాత్రం తాను మ‌రో మాహిష్మ‌తి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నంత బిల్డ‌ప్ ఇస్తున్నార‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. అయితే, బాబుగారు అధికారం చేప‌ట్టి నాలుగేళ్లు గ‌డ‌చినా...న‌వ్యాంధ్ర పరిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంద‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా అమ‌రావ‌తిలో నిర్మాణాల‌పై చంద్ర‌బాబు వైఖ‌రిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అసెంబ్లీ మీడియా పాయింట్ ద‌గ్గ‌ర ఎండ‌గ‌ట్టారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి అబద్ధాలకు నిలయంగా మారిందని, రాజధాని పేరుతో టీడీపీ ప్ర‌భుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ధ్వ‌జ‌మెత్తారు. అమరావతిలో ఎమ్మెల్యేల ఇళ్లు నిర్మించామని నిధులు తీసుకున్నారని, కానీ ఆ నిర్మాణాలు త‌మ‌కు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మ‌డి ఏపీ విభజ‌న‌కు టీడీపీ సహకరించింద‌ని - ఆనాడు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించ‌లేద‌ని సోము వీర్రాజు నిలదీశారు.

రాజధాని నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు ఖ‌ర్చు పెట్టి లీకుల‌తో కూడాని తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారని ఎద్దేవా చేశారు. టీడీపీ టీడీపీ....నీతినిజాయితీ లేని పార్టీ అని, శాసనసభ, శాసనమండలిలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. మిగ‌తా కొత్త రాష్ట్రాల‌లాగా తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించుకోకుండా నిధుల‌ను వృథా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. పొత్తు ఉన్న‌పుడు బీజేపీని పొగుడుతూ తీర్మానాలు చేశారని, ఇపుడు మోదీని తిడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 32 వేల కోట్ల రూపాయల ఎన్ ఆర్ ఈజీఎస్‌ నిధులను టీడీపీ నేతలు మింగేశారని ఆరోపించారు. డ్రైనేజీల నిర్మాణానికి కేంద్రం 1000 కోట్లు మంజూరు చేసినా....చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కట్టలేకపోయిందన్నారు. హైదరాబాద్‌లో చేసిన తప్పునే అమరావతిలో చేస్తున్నారని, టీడీపీకి చేతకాకుంటే తామే రాజ‌ధాని నిర్మిస్తామ‌న్నారు. రాజధాని పేరుతో విదేశీ సంస్థలకు భూములు పందేరం చేస్తున్నార‌ని, రాజ‌ధానికోసం ఇప్పటిదాకా డీపీఆర్‌ ఇవ్వలేదన్నారు. సభలో తమ పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేద‌ని, ప్ర‌శ్నిస్తే ముప్పేట దాడి చేస్తున్నార‌ని, అందుకే వాకౌట్‌ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.