Begin typing your search above and press return to search.

దేవత మాటతో.. భారత్ లో మహిళ తల నరికారు

By:  Tupaki Desk   |   21 July 2015 7:55 AM GMT
దేవత మాటతో.. భారత్ లో మహిళ తల నరికారు
X
ఎదుటివారి పట్ల అమానుషంగా వ్యవహరించటం.. మనిషి ప్రాణాల్ని తృణప్రాయంగా తీసి పారేయటం లాంటి అపర రాక్షస కాండను తాలిబన్ లు.. ఐఎస్ తీవ్రవాదులు తరచూ చేస్తుంటారు. దీని గురించిన వార్తల్లో వారిని అత్యంత దుర్మార్గులుగా పేర్కొనటం.. వారేం మనుషులు అంటూ తిట్టిపోస్తుంటాం. కానీ.. భారత్ లాంటి దేశంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా? అన్న సందేహం కలిగినా.. అలాంటివి చోటు చేసుకుంటున్నట్లు తాజా ఉదంతం చెబుతోంది.

ఇంతటి భయానక ఘటన జరగటానికి కారణాలు చూస్తే.. అసోంలోని సోనిత్ పూర్ జిల్లాలోని భీమాజులీ గ్రామంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 63 ఏళ్ల ఓరాంగ్ అనే మహిళ ఒకరు క్షుద్ర పూజలు చేస్తుందని.. దీని కారణంగా.. గ్రామానికి దురదృష్టం పట్టిందని.. ఆమెను చంపేయాలంటూ గ్రామ దేవతగా వ్యవహరించే 35ఏళ్ల రోగంటి వెల్లడించింది.

ఇంతకీ ఈ రోగంటి ఎవరంటారా? స్థానికంగా ఉండే ఒక దేవాలయంలో ఆమెకు దేవత పూనుతుందన్న పేరుంది. తాజాగా ఆమె దగ్గరకు వచ్చిన భక్తులకు ఓరాంగ్ కారణంగా గ్రామానికి దురదృష్టం పట్టిందని.. ఆమె క్షుద్ర పూజలు చేస్తుందని పేర్కొన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన 200 మందితో కూడిన భక్తుల గుంపు.. సదరు మహిళను వివస్త్రగా మార్చి.. ఊళ్లో ఊరేగించి.. అందరూ చూస్తుండగానే ఆమె తల నరికేశారు.

ఈ విషయం గురించి పోలీసులకు తెలీటంలో కేసు నమోదు చేసి.. ఈ ఘటనకు కారణమైన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మరో దారుణం బయటకు వచ్చింది. ఇలా క్షుద్రపూజలు చేస్తున్నారన్న ఆరోపణపై గత కొన్నేళ్లుగా వంద మందిని అత్యంత కిరాతకంగా వందమంది వరకూ నరికి చంపినట్లుగా చెబుతున్నారు.