Begin typing your search above and press return to search.

రాజ్ కోట్ ప్రజల మీద పడ్డ ‘హార్దిక్’ ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   18 Oct 2015 7:41 AM GMT
రాజ్ కోట్  ప్రజల మీద పడ్డ ‘హార్దిక్’ ఎఫెక్ట్
X
రాజ్ కోట్ వాసులకు హార్దిక్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలిసొస్తోంది. పటేళ్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్.. ఆదివారం రాజ్ కోట్ లో జరిగే భారత్.. దక్షిణాఫ్రికా మ్యాచ్ లో తమ ఆందోళన చేస్తామని ప్రకటించటం తెలిసిందే. తమ ఆందోళనను ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే వీలుగా భారీగా ఆందోళనలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్ కోట్ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లను తన మద్ధతుదారుల చేత కొనిపించిన ఆయన.. తన తాజా ఆందోళనలతో తమ డిమాండ్ పై మరింత చర్చ జరగాలని కోరుకుంటున్నారు.

తమ ఆందోళనల్ని పట్టించుకోని గుజరాత్ రాష్ట్ర సర్కారుతో పాటు.. తమను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రానికి షాక్ ఇవ్వాలన్నది హార్దిక్ మద్దతుదారుల ఆలోచనగా చెబుతున్నారు. హార్దిక్ అండ్ కో విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న భద్రతా సిబ్బంది.. ఏదైనా జరగరానిది జరిగితే ఉద్రికత్తలు చోటు చేసుకోకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో రాజ్ కోట్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.

ఇవాల్టి రేపటి రోజున మొబైల్ ఇంటర్నెట్ సర్వసాధారణమై.. చాలా అంశాల్లో వినియోగిస్తున్న ఇంటర్నెట్ పై నిషేధం విధించటంతో రాజ్ కోట్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం రాత్రి పది గంటలకు మొదలైన ఆంక్షలు సోమవారం ఉదయం 8 గంటల వరకు కొనసాగుతాయని చెప్పటంతో.. రాజ్ కోట్ వాసులందరిపైనా హార్దిక్ ఎఫెక్ట్ పడింది. ఇక.. స్టేడియం చుట్టూ భారీగా భద్రతా సిబ్బందితో పాటు.. పెద్ద ఎత్తున సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి.. ఈ ఏర్పాట్లను అధిగమించి హార్దిక్ తన నిరసన గళాన్ని ఎలా వినిపిస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.