Begin typing your search above and press return to search.

ఇక తెలంగాణలో కారుచౌకగా సెల్ ఫోన్లు?

By:  Tupaki Desk   |   26 Oct 2015 4:03 AM GMT
ఇక తెలంగాణలో కారుచౌకగా సెల్ ఫోన్లు?
X
ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ఆలోచన కానీ ఆచరణలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో సెల్ ఫోన్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. ఎక్కువ పన్ను వేసి అక్రమార్కులకు అవకాశం ఇచ్చే బదులు.. పన్ను తగ్గించి.. ఎక్కువమంది పన్ను పరిధిలోకి వచ్చే ఆలోచనను చేసింది.

ఇందుకోసం సెల్ ఫోన్ల మీద ప్ర్రస్తుతం వసూలు చేస్తున్న 14.5 శాతం వ్యాట్ ను 5 శాతానికి తగ్గించాలని భావిస్తోంది. అదే జరిగితే.. ప్రతి రూ.10వేలు పెట్టి కొనే ఫోన్ మీద రూ.వెయ్యి మేర భారం వినియోగదారుడి మీద పడకుండా పోతుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న 14.5 శాతం పన్ను కారణంగా ఎక్కువ మంది బిల్లు మీద ఫోన్ కొనే కన్నా.. విడిగా కొనేందుకు మక్కువ చూపిస్తున్నారు. దీంతో.. షోరూంలలో వ్యాపారాలు పెద్దగా ఉండటం లేదు.

పన్ను పరిధిలోకి రాకుండా వ్యాపారాలు చేసే వారిని ఆశ్రయిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాట్ ను 14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేస్తే గ్రే మార్కెట్ కి.. షోరూంకి మధ్య ధరల వ్యత్యాసం తగ్గిపోనుంది. దీంతో షోరూంలలో ఫోన్లు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణ సర్కారు ఆశిస్తున్నట్లుగా పన్ను మొత్తం భారీగా పెరిగే వీలుంది. మరి.. ఈ ఆలోచనను ఆచరణలోకి పెడతారా? లేదా? అన్నది చూడాలి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందిస్తే మాత్రం తెలంగాణలో సెల్ ఫోన్ల ధరలు భారీగా (9.5శాతం మేర) తగ్గే వీలుంది.