Begin typing your search above and press return to search.

ఆన్‌ లైన్‌ లో సెల్‌ ఫోన్లు అమ్మ‌కూడ‌దా?

By:  Tupaki Desk   |   27 Aug 2015 11:21 PM GMT
ఆన్‌ లైన్‌ లో సెల్‌ ఫోన్లు అమ్మ‌కూడ‌దా?
X
బిజీ లైఫ్ షెడ్యూల్ల‌లో స‌మ‌యం లేక‌పోవ‌డం, ఆన్‌లైన్ మార్కెట్ సుల‌భం కావ‌డంతో నేరుగా వెళ్లి కొనుగోలు చేసే వారికంటే ఆన్‌ లైన్‌ పై ఆధార‌ప‌డ్డ వారి సంఖ్యే పెరుగుతోంది. ఈ క్ర‌మంలో సెల్‌ ఫోన్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్ డివైస్‌ లు మార్కెట్ లో ఎక్కువ‌గా అమ్ముడుపోతున్నాయి. అయితే వీటిపై ఇపుడు కొత్త పేచీ మొద‌ల‌యింది.

సెల్‌ ఫోన్‌ల ఆన్‌ లైన్ అమ్మకాల నేపథ్యంలో తమకు వాటిల్లుతున్న నష్టాలకు నిరసనగా సెప్టెంబర్ 5న రెండు రాష్ట్రాల్లో బంద్ నిర్వహించాలని తీర్మానించినట్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తెలుగు సెల్యులర్ విక్రేతల సంఘం తెలిపింది. సెల్‌ ఫోన్‌ లను ఆన్‌ లైన్‌ లో అమ్మడం ద్వారా తమకు వాటిల్లుతున్న నష్టాలను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వారు వివ‌రించారు. వ్యాట్ సహా అన్ని ర‌కాల పన్నులు చెల్లించి వ్యాపారం చేస్తున్న తమకు సెల్‌ఫోన్ తయారీ సంస్థలు సెల్‌ఫోన్‌ల‌ను అధిక ధరకు విక్రయిస్తున్నాయని విమర్శించారు. మ‌రోవైపు ఆన్‌లైన్ అమ్మకందారులకు మాత్రం రూ. 2వేల నుంచి రూ. 4వేల వ్యత్యాసంతో సెల్‌ ఫోన్‌ లను సరఫరా చేస్తుండటంతో తమ అమ్మకాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీన్ని నిరసిస్తూ బంద్ చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

అయితే ఈ బంద్ ఎవ‌రికి వ్య‌తిరేకంగా చేప‌ట్టారు? ఈ క్ర‌మంలో కేవ‌లం షాప్‌ల‌నే బంద్ చేస్తారా లేదా ఇంకేదైనా కార్య‌చ‌ర‌ణ ఉంటుందా? ప‌్ర‌భుత్వానికి ఏమైనా ప్ర‌తిపాద‌న‌లు పెడ‌తారా అనే వివ‌రాలు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.