Begin typing your search above and press return to search.

సెల్ ఫోన్ మీద జీఎస్టీ బాదుడు..ఎంత పెరగనుందంటే?

By:  Tupaki Desk   |   15 March 2020 4:48 AM GMT
సెల్ ఫోన్ మీద జీఎస్టీ బాదుడు..ఎంత పెరగనుందంటే?
X
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా మారింది మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని చూస్తుంటే. ప్రభుత్వం తనకు వచ్చే పన్ను ఆదాయాన్ని పెంచుకోవటానికి.. తనకున్న అన్ని అవకాశాల్ని విపరీతంగా వాడేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 34 డాలర్లకు పరిమితమైనప్పటికీ.. పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటరుకు మూడు రూపాయిల చొప్పున పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని మర్చిపోకూడదు.

ఇలాంటి బాదుడు మరిన్ని ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా జీఎస్టీ మండలి సరికొత్త నిర్ణయాల్ని ప్రకటించింది. సెల్ ఫోన్లపై ఇప్పటివరకు ఉన్న పన్ను భారాన్ని పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. సెల్ మరింత ఖరీదు ఎక్కనుంది.

కలకలం రేపుతున్న కరోనా పుణ్యమా అని.. చైనాలో చోటు చేసుకున్న పరిణామాలతో సెల్ ఫోన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కనిష్ఠంగా ఐదు వందల నుంచి గరిష్ఠంగా మూడు.. నాలుగు వేల వరకూ ధరల్లో మార్పులు రాగా.. తాజాగా జీఎస్టీ మండలి ఏకంగా ఆరు శాతం పన్ను పోటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.

తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ప్రతి వందకు రూ.6 చొప్పు.. వెయ్యికి రూ.60 చొప్పున కొత్త భారం పడనుంది. పదివేల రూపాయిల ఫోన్ మీద కొత్త పన్ను ప్రకారం రూ.600 అదనపు భారం పడనుంది. నిత్యవసర వస్తువుగా మారిన సెల్ మీద పన్ను పోటును పెంచేయటమే కాదు.. సెల్ ఫోన్ విడిభాగాల మీదా పన్ను భారాన్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.