Begin typing your search above and press return to search.

మోదీజీ.. బహుత్ బహుత్ ధన్యవాద్

By:  Tupaki Desk   |   22 Oct 2015 9:10 AM GMT
మోదీజీ.. బహుత్ బహుత్ ధన్యవాద్
X
అమరావతి శంకుస్థాపసనకు ప్రధాని మోడీ వస్తున్నారని తెలియగానే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శంకుస్థాపనకు వచ్చే మోడీ రాష్ట్రానికి వరాలు ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ, పండుగ రోజు ప్రజల ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. దసరా రోజున మోడీ ఏపీ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచారు. అమరావతికి సహకారం అందిస్తామని చెప్పడం... ఇంతవరకు ఏమేమి ఇచ్చారో చెప్పడం మినహా కొత్తగా సహాయం చేస్తానని మాత్రం చెప్పలేదు. దీంతో ప్రత్యేక హోదా ప్రకటిస్తారని అత్యాశలు పెట్టుకున్నవారు, ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చూసిన వారికి ఆశాభంగమైంది. మోడీ వచ్చారు.. వెళ్లారు... నాలుగు తియ్యటి మాటలు చెప్పి.. ‘‘బహుత్ బహుత్ ధన్యవాద్‘‘ అంటూ వెళ్లిపోయారు.

‘‘చంద్రబాబు దేశవ్యాప్తంగా మట్టి , జలాలు సేకరించిన విషయం తెలిసి నేను పార్లమెంటు నుంచి మట్టి, పవిత్రమైన యమునానది నుంచి నీటిని తీసుకుని వచ్చాను. చంద్రబాబుకు అందించినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుందని ఉద్వేగంగా ఉన్నట్లు తెలిపారు.. ఆ మట్టి నీరు మాత్రమే కాదు ఇక్కడకు వచ్చింది. దేశమే ఇక్కడ మట్టి,నీటిలో కలవడానికి వచ్చిందని మోడి వివరించారు. కేంద్రం,రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తుంది’’ అంటూ తియ్యటి మాటలు చెప్పిన మోడీ ఏపీకి దక్కాల్సిన సహాయంపై మాత్రం మాట్లాడలేదు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్నీ తు.చ. తప్పకుండా అమలు చేస్తామని, అత్యాధునిక నగరంగా సాకారం కాబోతున్న అమరావతి సాక్షిగా తాను ఈ మాట చెబుతున్నానని మోడీ చెప్పడంతో మళ్లీ ఆశలు పెట్టుకోవడం తప్ప స్పష్టమైన హామీలు దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామన్న ఆయన మాటలు ఎంతవరకు నెరవేరుతాయో అమరావతి భవిష్యత్తే చెప్పాలి.