Begin typing your search above and press return to search.

మోడీషాల‌కు కేసీఆర్ స్ఫూర్తిగా మారారా?

By:  Tupaki Desk   |   29 Aug 2018 6:23 AM GMT
మోడీషాల‌కు కేసీఆర్ స్ఫూర్తిగా మారారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో ఉన్న గొప్ప గుణం ఏమంటే.. త‌న ప‌రిచ‌య‌స్తుల్ని.. తాను త‌రుచూ భేటీ అయ్యే వారిని ప్ర‌భావితం చేస్తుంటారు. ఇందుకు ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు కూడా మిన‌హాయింపు కాదేమో. లేకుంటే.. కేసీఆర్ ప‌నుల చిట్టా తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంటే.. మూడు రోజుల వ్య‌వ‌ధిలో కేంద్రం భారీగా స్పందించటం మామూలు విష‌య‌మా? మోడీ.. కేసీఆర్ ల మ‌ధ్య అనుబంధానికి ఇదో మ‌చ్చుతున‌క‌గా చెప్పాలి.

ఒక‌ప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి అపాయింట్ మెంట్ ఇవ్వ‌టానికి సైతం ఇష్ట‌ప‌డ‌ని మోడీ.. ఇటీవ‌ల కాలంలో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో మూడుసార్లు భేటీ అయ్యే వ‌ర‌కూ వెళ్ల‌టం మామూలు విష‌య‌మా? గ‌తంలో అపాయింట్ మెంట్ ఇచ్చి.. కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్న త‌ర్వాత అపాయింట్ మెంట్ ర‌ద్దు కావ‌టం తెలిసిందే.

తాజాగా మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. కేసీఆర్ లో ఉన్న మ‌రో ఆస‌క్తిక‌ర కోణం ఏమంటే.. త‌న‌కు ఏదైనా చెప్పాల‌నిపిస్తే.. ఎదుట ఉన్నది ప్ర‌ధాన‌మంత్రా? ఇంకెవ‌రైనా ఉన్నారా? అన్న‌ది ప‌ట్టించుకోకుండా స‌ల‌హా ఇచ్చేస్తుంటారు.

గుర్తుకు తెచ్చుకుంటే.. విభ‌జ‌న తొలినాళ్ల‌లో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌ పంచాయితీలు పెరుగుతున్న వేళ‌.. ఇద్ద‌రు చంద్రుళ్లు భేటీ అయిన సంద‌ర్భంగా అమ‌రావ‌తి వాస్తు గురించి.. ఏపీ రాజ‌ధాని విష‌యంలో ఏం చేయాల‌న్న అంశాల‌ను త‌న‌కు తానుగా కేసీఆర్ చెప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇలా అడ‌గ‌కుండానే స‌ల‌హాలు ఇచ్చేయ‌టం కేసీఆర్ కు అల‌వాటే.

ఇలాంటి స‌ల‌హాలు.. సూచ‌న‌ల్ని ఇటీవ‌ల తాను భేటీ అయిన ప్ర‌ధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమైనా ఇచ్చారా? అన్న సందేహం క‌లుగుతోంది. ఎందుకంటే.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో ఎప్పుడూ లేని విధంగా మోడీషాలు తాజాగా ఒక మీటింగ్‌ ను ఏర్పాటు చేశారు. గ‌తంలో ఏ రాష్ట్ర ఎన్నిక‌ల సంద‌ర్భంలోనూ ఏర్పాటు చేయ‌ని మీటింగ్ ను తాజాగా నిర్వ‌హించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. ఉప ముఖ్య‌మంత్రుల‌తో పాటు కేంద్ర‌మంత్రులు పాల్గొన్న ఈ స‌మావేశాన్ని ఏడు గంట‌ల పాటు నిర్వ‌హించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌తోనూ.. అధికారుల‌తోనూ కేసీఆర్ భేటీ అయితే.. మార‌థాన్ మీటింగ్ ల‌ను నిర్వ‌హించ‌టం మామూలే. తాజాగా షా నిర్వ‌హించిన ఈ మీటింగ్ కేసీఆర్ త‌ర‌హాలో అన్నేసి గంట‌లు నిర్వ‌హించిన తీరు చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.